'ఏబీతో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చూస్తున్నా'
లండన్:దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ టెన్నిస్ ఆటగాడు కెవిన్ అండర్సన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఒక టెన్నిస్ మ్యాచ్ జరిగిన విషయాన్ని అండర్సన్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో తనపై ఏబీ విజయం సాధించాడని, ఆపై మళ్లీ తమ మధ్య మ్యాచ్ జరగలేదన్నాడు. వింబుల్డన్ గ్రాండ్ లో నాల్గో రౌండ్ కు చేరిన క్రమంలో అండర్సన్ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని స్మరించుకున్నాడు.
'ఏబీతో టెన్నిస్ మ్యాచ్ ఆడి చాలా ఏళ్లు అయ్యింది. అతనికి 12 ఏళ్లు.. నాకు 10 ఏళ్ల వయసులో ఇద్దరం కలిసి ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో నన్ను ఏబీ ఓడించాడు. డివిలియర్స్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు ఏబీ దూరంగా ఉన్నాడు. మా మధ్య రీమ్యాచ్ కు ఇదే సమయం అనుకుంటున్నా'అని అండర్సన్ తెలిపాడు. అయితే అండర్సన్ విజ్ఞప్తికి ఏబీ తనదైన శైలిలో స్పందించాడు. నాల్గో రౌండ్ కు చేరిన అండర్సన్ కు ఆల్ ద బెస్ట్.. మన మధ్య రీమ్యాచ్ 30 నిమిషాల్లో ముగించేస్తా అంటూ ఏబీ ట్వీట్ చేశాడు. ఏబీ డివిలియర్స్ కు క్రికెట్ తో పాటు పలు క్రీడల్లో ప్రావీణ్యమున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టెన్నిస్ జూనియర్ సర్కిల్ లో ఏబీకి గుర్తింపు ఉంది. అయితే క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకోవడంతో మిగతా క్రీడల్ని ఏబీ వదులుకోవాల్సి వచ్చింది.