kevin anderson
-
అండర్సన్‌కు చుక్కెదురు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్‌లో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. పదోసీడ్ ఖచనోవ్ (రష్యా) కూడా పరాజయం చవిచూడగా, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), రావ్‌నిచ్ (కెనడా) ప్రిక్వార్టర్స్ చేరాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు నాలుగో సీడ్ అండర్సన్ 4–6, 3–6, 6–7 (4/7)తో 26వ సీడ్ పెల్లా చేతిలో కంగుతిన్నాడు. మిగతా మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7–5, 6–7 (5/7), 6–1, 6–4తో హుర్కాజ్ (పోలాండ్)పై, 15వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/1), 6–2, 6–1తో రెలీ ఒపెల్కా (అమెరికా)పై గెలుపొందారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా) 3–6, 6–7 (3/7), 1–6 స్పెయిన్‌కు చెందిన 23వ సీడ్ అగుట్ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో అజరెంకా (బెలారస్)పై, మూడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 2–6, 6–4తో సు వే హై (చైనీస్ తైపీ)పై, 8వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–7 (1/7), 6–2తో సక్కారి (గ్రీస్)పై గెలిచారు. -
అండర్సన్‌కు సింగిల్స్ టైటిల్ ...
టాటా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అండర్సన్ 7–6 (7/4), 6–7 (2/7), 7–6 (7/5)తో గెలుపొందాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 95 కేజీల బరువున్న అండర్సన్ మ్యాచ్‌లో 21 ఏస్‌లు... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న కార్లోవిచ్ 36 ఏస్‌లు సంధించడం విశేషం. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నమోదు కాకపోవడం విశేషం. చివరి సెట్ టైబ్రేక్‌లో 39 ఏళ్ల కార్లోవిచ్ 5–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి ఓటమి చవిచూశాడు. విజేత అండర్సన్‌కు 90,990 డాలర్ల (రూ. 63 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఫెడరర్ 15వ సారి...
లండన్: తొలి లీగ్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయినా... తదుపరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘లీటన్ హెవిట్ గ్రూప్’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 6–3తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో 16వసారి పాల్గొంటున్న ఫెడరర్ సెమీఫైనల్‌కు చేరడం ఇది 15వసారి కావడం విశేషం. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండేసి విజయాలు సాధించిన ఫెడరర్, అండర్సన్ ‘హెవిట్ గ్రూప్’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత పొందారు. అయితే మెరుగైన గేమ్‌ల సగటు ఆధారంగా ఫెడరర్ గ్రూప్ టాపర్‌గా నిలువగా... అండర్సన్‌కు రెండో స్థానం దక్కింది. ఇదే గ్రూప్‌లో ఒక్కో విజయం సాధించిన నిషికోరి (జపాన్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) లీగ్ దశలోనే నిష్క్రమించారు. ‘కుయెర్టన్ గ్రూప్’ నుంచి నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ 7–6 (7/5), 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌తో ఫెడరర్; అండర్సన్‌తో జొకోవిచ్ తలపడతారు. -
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ జొకోవిచ్‌దే
-
జైకోవిచ్...
కుడి మోచేతి గాయం కారణంగా గత ఏడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి వైదొలిగిన నొవాక్ జొకోవిచ్... సంవత్సరం తిరిగేలోపే అదే వేదికపై చాంపియన్‌గా అవతరించాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి వెనుకబడిపోయిన ఈ సెర్బియా స్టార్ తాజా విజయంతో నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా మళ్లీ పైకెగిశాడు. లండన్: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ‘గ్రాండ్’ విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ జొకోవిచ్ 6–2, 6–2, 7–6 (7/3)తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది నాలుగో వింబుల్డన్ టైటిల్‌కాగా... కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక జొకోవిచ్ సాధించిన మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్ అండర్సన్‌కు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో ఇవానిసెవిచ్ (క్రొయేషియా) తర్వాత వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తక్కువ ర్యాంక్ ఆటగాడు జొకోవిచ్ (21వ ర్యాంక్) కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై, సెమీఫైనల్లో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై ఐదు సెట్ల సుదీర్ఘ పోరాటాల్లో అద్భుత విజయాలు సాధించిన అండర్సన్ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 92 కేజీల బరువున్న అండర్సన్‌పై తొలి గేమ్ నుంచే ఆధిపత్యం చలాయించిన జొకోవిచ్ తొలి సెట్లో రెండు... రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లు సాధించి అలవోకగా సెట్లను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో అండర్సన్ తేరుకోవడం... జొకోవిచ్ తన జోరును కొనసాగించడంతో ఒక్క బ్రేక్ పాయింట్ రాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజయానంతరం జొకోవిచ్ సరదాగా సెంటర్కోర్టులోని పచ్చికను నోట్లో వేసుకున్నాడు. నాకివి అద్భుతమైన క్షణాలు. నా భార్య, కుమారుడి ముందు గెలిచిన ఈ టైటిల్ నా జీవితంలోనే మధురానుభూతిగా మిగలనుంది. నా దృష్టిలో టెన్నిస్‌కు వింబుల్డన్ పవిత్రమైన వేదిక. టైటిల్‌తో పునరాగమనం చేసేందుకు ఇంతకుమించిన వేదిక ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడ ట్రోఫీని సగర్వంగా అందుకోవాలని నేను బాల్యంలోనే కలలు కనేవాణ్ని. ఇంత గొప్ప వేదికపై నాలుగోసారి టైటిల్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జొకోవిచ్ ఈ పచ్చిక ఎంతో తీయన... -
వింబుల్డన్ చాంపియన్ సెర్బియా యోధుడు
లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేతగా సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై 6-2, 6-2, 7-6 తేడాతో జొకోవిచ్ విజయం సాధించి తన కెరీర్లో మరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో నెగ్గి ప్రత్యర్థి అండర్సన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని జొకోకు.. కెరీర్లో తాజా గ్రాండ్‌స్లామ్ నాలుగో వింబుల్డన్ ట్రోఫీ. కాగా, 2011, 2014, 2015లలో సెర్బియా ప్లేయర్ జొకోవిచ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన అండర్సన్‌కు నిరాశే ఎదురైంది. ఈ దక్షిణాఫ్రికా టెన్నిస్ స్టార్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
6 గంటల 35 నిమిషాలు...
లండన్: కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని జాన్ ఇస్నెర్ (అమెరికా)... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)... ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. చివరకు అండర్సన్ గెలుపొందగా... ఓడినా జాన్ ఇస్నెర్ తన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. 6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ అండర్సన్ 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో తొమ్మిదో సీడ్ ఇస్నెర్‌పై గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడతాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు, ప్రతీ గేమ్‌కు కొదమ సింహాల్లా పోరాడారు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు క్లెమెంట్ (ఫ్రాన్స్), సాంతోరో (ఫ్రాన్స్) పేరిట (ఫ్రెంచ్ ఓపెన్–2004 తొలి రౌండ్; 6 గంటల 33 నిమిషాలు) ఉంది. ఇక టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ కూడా వింబుల్డన్‌లోనే నమోదైంది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది. ఆ మ్యాచ్‌లో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో గెలిచాడు. ప్రస్తుత సెమీస్‌లో ఇద్దరూ చెరో రెండో సెట్లు గెలిచాక నిర్ణాయక ఐదో సెట్లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని గెలిచాడు. -
యూఎస్ ఓపెన్ విజేత నాదల్
న్యూయార్క్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. మూడోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచి ఈ మైలురాయిని అందుకున్నాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో నాదల్ విజృంభించి ఆడి వరుస సెట్లలో విజయం సాధించాడు. 6-3, 6-3, 6-4 తేడాతో కెవిన్ అండర్సన్‌ను చిత్తుగా ఓడించాడు. ఈ ఏడాది నాదల్ మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన రాఫెల్ స్థాయికి తగిన ఆటతీరుతో అండర్సన్‌ను బెంబేలెత్తించాడు. 1968 తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా నిలిచిన అండర్సన్ రన్నరప్‌గానే మిగిలాడు. విజేతగా నిలిచిన నాదల్కు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్ అండర్సన్‌కు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాదిలో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం పట్ల నాదల్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ ఏడాదిలో ఇలా జరగడం నమ్మశక్యంగా లేదు. వ్యక్తిగత సమస్యలు, గాయాలు కారణంగా కొన్నేళ్లుగా బాగా ఆడలేకపోయాను. ఈ సీజన్లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాన’ని మ్యాచ్ ముగిసిన తర్వాత నాదల్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్ ఫస్ట్.. నాదల్ సెకండ్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన వారిలో రోజర్ ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 19 టైటిల్స్ సాధించగా, నాదల్ ఖాతాలో 16 టైటిల్స్ ఉన్నాయి. పీట్ సంప్రాస్(14), జొకొవిక్(12), ఎమర్సన్(12), బొర్గ్(11), లావర్(11), టిల్డన్(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నాదల్ అత్యధికంగా 10 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. మూడు యూఎస్ ఓపెన్, రెండు వింబుల్డన్ టైటిల్స్ అందుకున్నాడు. ఒకసారి ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచాడు. -
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
-
ఇంకొక్కటే..
♦ నాదల్ x అండర్సన్ ♦ 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై స్పెయిన్ స్టార్ గురి ♦ తొలి ‘గ్రాండ్’ టైటిల్‌పై దక్షిణాఫ్రికా ప్లేయర్ దృష్టి ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ ∙నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ పురుషుల సింగిల్స్ ఫైనల్ రాత్రి గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం ఇద్దరికీ 31 ఏళ్లే. ఇద్దరూ చిన్ననాటి నుంచే ప్రత్య ర్థులు. ఒకరికేమో 23వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... మరొకరికి కెరీర్లోనే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరు... ఒకరేమో అంచనాలు నిజం చేస్తూ ముందుకు సాగగా... మరొకరేమో ప్రతికూల పరిస్థితులను దాటి... ఒక్కో అడ్డంకిని అధిగమించి... ఎవ్వరూ ఊహించని విధంగా అంతిమ సమరానికి అర్హత సాధించారు. ఆ ఇద్దరే స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్, దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు కెవిన్ అండర్సన్. కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ అందుకోవడానికి నాదల్... దక్షిణాఫ్రికా తరఫున రెండో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్ అయ్యేందుకు అండర్సన్... ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నారు. 20 ఏళ్ల క్రితమే సబ్ జూనియర్ స్థాయి నుంచి ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ సీనియర్‌స్థాయిలో మాత్రం నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అయితే నాలుగుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. న్యూయార్క్: కొంతకాలం క్రితం గాయాలతో సతమతమైనప్పటికీ... పూర్తి ఫిట్నెస్ సంతరించుకొని ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కెరీర్లో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 4–6, 6–0, 6–3, 6–2తో 24వ సీడ్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ తొలి సెట్‌ను కోల్పోయినా... ఆ వెంటనే తేరుకొని డెల్ పొట్రో ఆట కట్టించాడు. ఐదు ఏస్‌లు సంధించిన నాదల్ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకొని డెల్ పొట్రో సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 45 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ 20 అనవసర తప్పిదాలు చేశాడు. సెమీస్‌లో మాజీ చాంపియన్ ఫెడరర్‌ను ఓడించిన 2009 యూఎస్ ఓపెన్ చాంపియన్ డెల్ పొట్రో ఈ మ్యాచ్‌లో మాత్రం నాదల్ ఆటకు తగిన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఏకంగా 40 అనవసర తప్పిదాలు చేసిన డెల్ పొట్రో తొలి సెట్ మినహా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ గెలుపుతో నాదల్ 2009 యూఎస్ ఓపెన్ సెమీస్‌లో డెల్ పొట్రో చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. పాబ్లో జోరుకు అండర్సన్ బ్రేక్... సెమీఫైనల్ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్) జోరుకు దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్ బ్రేక్ వేశాడు. సెమీఫైనల్లో 28వ సీడ్ అండర్సన్ 4–6, 7–5, 6–3, 6–4తో 12వ సీడ్ పాబ్లో బుస్టాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 93 కేజీల బరువున్న అండర్సన్ 22 ఏస్‌లు సంధించాడు. కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసిన అండర్సన్ 58 విన్నర్స్ కొట్టి, పాబ్లో సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. కెరీర్లో 34వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న అండర్సన్ ఆదివారం జరిగే ఫైనల్లో గెలిస్తే దక్షిణాఫ్రికా తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. గతంలో దక్షిణాఫ్రికా తరఫున జొహాన్ క్రియెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో (1981, 1982లో) టైటిల్ సాధించాడు. 3 ఈ ఏడాది నాదల్ మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిన ఈ స్పెయిన్ స్టార్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. 3 ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం నాదల్‌కిది మూడోసారి. 2010, 2011లో కూడా అతను మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో టైటిల్ పోరుకు అర్హత పొందాడు. 1 ఓపెన్ శకంలో (1968 తర్వాత) యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. చివరిసారి దక్షిణాఫ్రికా తరఫున క్లిఫ్ డ్రయిస్డేల్ 1965లో యూఎస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. గత కొన్నేళ్లలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఈ ఏడాది నాకెంతో కలిసొచ్చింది. డెల్ పొట్రోతో జరిగిన సెమీస్‌లో తొలి సెట్ ఓడిపోయాక నా వ్యూహాలను మార్చాను. అతని బ్యాక్‌హ్యాండ్ వైపు నేను ఎక్కువగా షాట్లు ఆడిమూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా పొరపాట్లు తెలుసుకొని బ్యాక్‌హ్యాండ్ వైపునకు కాకుండా కోర్టుకిరువైపులా షాట్లు ఆడి ఫలితం పొందాను. నా ఫైనల్ ప్రత్యర్థి అండర్సన్ చాలా ప్రమాదకర ఆటగాడు. నాకు అతను 12 ఏళ్ల వయసు నుంచి తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలబారిన పడినప్పటికీ అండర్సన్ కోలుకుని ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరడం గొప్ప విషయం. చిన్నారులందరూ అతడిని ఆదర్శంగా తీసుకోవాలి. – నాదల్ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. తుంటి గాయం కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాను. శస్త్ర చికిత్స జరిగాక కోలుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరినందుకు ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఇక ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాను. – అండర్సన్ -
యూఎస్ ఓపెన్ 2017: ఫైనల్‌కు నాదల్
సాక్షి, వాషింగ్టన్: టెన్నిస్ సంచలన స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అమెరికా ఓపెన్ టోర్నీ ఫైనల్ కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రోపై విక్టరీ సాధించాడు. శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 4-6, 6-0, 6-3, 6-2 తేడాతో విక్టరీ సాధించాడు. కాగా, ఈ విజయంతో తన కెరీర్లో 23వ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ లో అడుగుపెట్టగా, 2013 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు నాదల్ చేరుకోవటం విశేషం. డెల్ పొట్రో రోజర్ ఫెదరర్ ను ఓడించి ఇంటికి సాగనంపిన విషయం తెలిసిందే. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా స్టార్ కెవిన్ అండర్సన్, పబ్‌లో బుస్తాను ఓడించి ఫైనల్ కు చేరాడు. సెప్టెంబర్ 11న మెన్స్ సింగిల్స్ టైటిల్ కోసం నాదల్-అండర్సన్‌ల మధ్య పోరు జరగనుంది. -
'ఏబీతో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చూస్తున్నా'
లండన్:దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ టెన్నిస్ ఆటగాడు కెవిన్ అండర్సన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఒక టెన్నిస్ మ్యాచ్ జరిగిన విషయాన్ని అండర్సన్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో తనపై ఏబీ విజయం సాధించాడని, ఆపై మళ్లీ తమ మధ్య మ్యాచ్ జరగలేదన్నాడు. వింబుల్డన్ గ్రాండ్ లో నాల్గో రౌండ్ కు చేరిన క్రమంలో అండర్సన్ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని స్మరించుకున్నాడు. 'ఏబీతో టెన్నిస్ మ్యాచ్ ఆడి చాలా ఏళ్లు అయ్యింది. అతనికి 12 ఏళ్లు.. నాకు 10 ఏళ్ల వయసులో ఇద్దరం కలిసి ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో నన్ను ఏబీ ఓడించాడు. డివిలియర్స్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు ఏబీ దూరంగా ఉన్నాడు. మా మధ్య రీమ్యాచ్ కు ఇదే సమయం అనుకుంటున్నా'అని అండర్సన్ తెలిపాడు. అయితే అండర్సన్ విజ్ఞప్తికి ఏబీ తనదైన శైలిలో స్పందించాడు. నాల్గో రౌండ్ కు చేరిన అండర్సన్ కు ఆల్ ద బెస్ట్.. మన మధ్య రీమ్యాచ్ 30 నిమిషాల్లో ముగించేస్తా అంటూ ఏబీ ట్వీట్ చేశాడు. ఏబీ డివిలియర్స్ కు క్రికెట్ తో పాటు పలు క్రీడల్లో ప్రావీణ్యమున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టెన్నిస్ జూనియర్ సర్కిల్ లో ఏబీకి గుర్తింపు ఉంది. అయితే క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకోవడంతో మిగతా క్రీడల్ని ఏబీ వదులుకోవాల్సి వచ్చింది. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పెను సంచలనం. ఓ అనామక ఆటగాడి చేతిలో ఓటమిపాలైన ప్రపంచ మూడో సీడ్ ఆండీ ముర్రే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాకు చెందిన 15వ సీడ్ కెవెన్ అండర్సన్ చేతిలో 7-6, 6-3, 6-7, 7-6 తేడాతో ముర్రే మట్టికరిచాడు. గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన కెవెన్.. ఈ సంచలన విజయంతో ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్షించాడు. ముర్రే 2012 యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.