ఇంకొక్కటే.. | US Open Final Preview: Nadal Vs. Anderson | Sakshi
Sakshi News home page

ఇంకొక్కటే..

Published Sun, Sep 10 2017 1:24 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

ఇంకొక్కటే.. - Sakshi

ఇంకొక్కటే..

నాదల్‌ x అండర్సన్‌
16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై స్పెయిన్‌ స్టార్‌ గురి
తొలి ‘గ్రాండ్‌’ టైటిల్‌పై దక్షిణాఫ్రికా ప్లేయర్‌ దృష్టి
యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ ∙నేడు పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌  


పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌
రాత్రి గం. 1.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


ఇద్దరికీ 31 ఏళ్లే. ఇద్దరూ చిన్ననాటి నుంచే ప్రత్య ర్థులు. ఒకరికేమో 23వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కాగా... మరొకరికి కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరు... ఒకరేమో అంచనాలు నిజం చేస్తూ ముందుకు సాగగా... మరొకరేమో ప్రతికూల పరిస్థితులను దాటి... ఒక్కో అడ్డంకిని అధిగమించి... ఎవ్వరూ ఊహించని విధంగా అంతిమ సమరానికి అర్హత సాధించారు. ఆ ఇద్దరే స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్, దక్షిణాఫ్రికా ఆజానుబాహుడు కెవిన్‌ అండర్సన్‌. కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ అందుకోవడానికి నాదల్‌... దక్షిణాఫ్రికా తరఫున రెండో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ చాంపియన్‌ అయ్యేందుకు అండర్సన్‌... ఒకే ఒక్క విజయం దూరంలో ఉన్నారు. 20 ఏళ్ల క్రితమే సబ్‌ జూనియర్‌ స్థాయి నుంచి ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ సీనియర్‌స్థాయిలో మాత్రం నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడ్డారు. అయితే నాలుగుసార్లూ నాదల్‌నే విజయం వరించింది.

న్యూయార్క్‌: కొంతకాలం క్రితం గాయాలతో సతమతమైనప్పటికీ... పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకొని ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ కెరీర్‌లో 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 4–6, 6–0, 6–3, 6–2తో 24వ సీడ్‌ జువాన్‌ మార్టిన్‌ డెల్‌ పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ తొలి సెట్‌ను కోల్పోయినా... ఆ వెంటనే తేరుకొని డెల్‌ పొట్రో ఆట కట్టించాడు.

ఐదు ఏస్‌లు సంధించిన నాదల్‌ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకొని డెల్‌ పొట్రో సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 45 విన్నర్స్‌ కొట్టిన ఈ స్పెయిన్‌ స్టార్‌ 20 అనవసర తప్పిదాలు చేశాడు. సెమీస్‌లో మాజీ చాంపియన్‌ ఫెడరర్‌ను ఓడించిన 2009 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ డెల్‌ పొట్రో ఈ మ్యాచ్‌లో మాత్రం నాదల్‌ ఆటకు తగిన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఏకంగా 40 అనవసర తప్పిదాలు చేసిన డెల్‌ పొట్రో తొలి సెట్‌ మినహా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ గెలుపుతో నాదల్‌ 2009 యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో డెల్‌ పొట్రో చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.  

పాబ్లో జోరుకు అండర్సన్‌ బ్రేక్‌...
సెమీఫైనల్‌ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోని పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌) జోరుకు దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్‌ అండర్సన్‌ బ్రేక్‌ వేశాడు. సెమీఫైనల్లో 28వ సీడ్‌ అండర్సన్‌ 4–6, 7–5, 6–3, 6–4తో 12వ సీడ్‌ పాబ్లో బుస్టాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 93 కేజీల బరువున్న అండర్సన్‌ 22 ఏస్‌లు సంధించాడు. కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసిన అండర్సన్‌ 58 విన్నర్స్‌ కొట్టి, పాబ్లో సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. కెరీర్‌లో 34వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న అండర్సన్‌ ఆదివారం జరిగే ఫైనల్లో గెలిస్తే దక్షిణాఫ్రికా తరఫున గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. గతంలో దక్షిణాఫ్రికా తరఫున జొహాన్‌ క్రియెక్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో (1981, 1982లో) టైటిల్‌ సాధించాడు.  

3
ఈ ఏడాది నాదల్‌ మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ఫెడరర్‌ చేతిలో ఓడిన ఈ స్పెయిన్‌ స్టార్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.  

3
ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరడం నాదల్‌కిది మూడోసారి. 2010, 2011లో కూడా అతను మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో టైటిల్‌ పోరుకు అర్హత పొందాడు.

1
ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన తొలి దక్షిణాఫ్రికా క్రీడాకారుడిగా అండర్సన్‌ నిలిచాడు. చివరిసారి దక్షిణాఫ్రికా తరఫున  క్లిఫ్‌ డ్రయిస్‌డేల్‌  1965లో యూఎస్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

గత కొన్నేళ్లలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఈ ఏడాది నాకెంతో కలిసొచ్చింది. డెల్‌ పొట్రోతో జరిగిన సెమీస్‌లో తొలి సెట్‌ ఓడిపోయాక నా వ్యూహాలను మార్చాను. అతని బ్యాక్‌హ్యాండ్‌ వైపు నేను ఎక్కువగా షాట్‌లు ఆడిమూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా పొరపాట్లు తెలుసుకొని బ్యాక్‌హ్యాండ్‌ వైపునకు కాకుండా కోర్టుకిరువైపులా షాట్‌లు ఆడి ఫలితం పొందాను. నా ఫైనల్‌ ప్రత్యర్థి అండర్సన్‌ చాలా ప్రమాదకర ఆటగాడు. నాకు అతను 12 ఏళ్ల వయసు నుంచి తెలుసు. గతంలో ఎన్నోసార్లు గాయాలబారిన పడినప్పటికీ అండర్సన్‌ కోలుకుని ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరడం గొప్ప విషయం. చిన్నారులందరూ అతడిని ఆదర్శంగా తీసుకోవాలి.   
 – నాదల్‌

కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరుకున్న ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. తుంటి గాయం కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాను. శస్త్ర చికిత్స జరిగాక కోలుకొని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరినందుకు ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఇక ఫైనల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాను.
– అండర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement