tennis match
-
అభిమానుల కోసమే.. హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్
మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అయితే సానియా మీర్జా పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్ ఆడాలని భావించింది. అందుకే రేపు హైదరాబాద్‌లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సానియా మీడియాతో మాట్లాడుతూ.. ''అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు తన కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది. ఇక ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలి రానున్నారు. తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది. చదవండి: WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా.. రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి -
51,954 మంది ప్రేక్షకులు...
కేప్‌టౌన్: ఆఫ్రికా దేశాల్లోని చిన్నారుల విద్యా, క్రీడాభివృద్ధి కోసం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ ‘మ్యాచ్ ఇన్ ఆఫ్రికా’ పేరిట ఫెడరర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ వేదిక కేప్‌టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఏకంగా 51,954 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ టెన్నిస్ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షించడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 3–6, 6–3తో నాదల్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫెడరర్ ఫౌండేషన్ 35 లక్షల డాలర్లను (రూ. 25 కోట్లు) సేకరించడం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన ఫెడరర్ తల్లి లినెట్టి కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడూ ఫెడరర్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ ఆడలేదు. గత నవంబర్‌లో మెక్సికోలో ఫెడరర్, జ్వెరెవ్ (జర్మనీ) మ్యాచ్‌కు 42,517 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
'ఏబీతో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చూస్తున్నా'
లండన్:దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తో టెన్నిస్ రీమ్యాచ్ కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ టెన్నిస్ ఆటగాడు కెవిన్ అండర్సన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాల క్రితం ఇద్దరి మధ్య ఒక టెన్నిస్ మ్యాచ్ జరిగిన విషయాన్ని అండర్సన్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో తనపై ఏబీ విజయం సాధించాడని, ఆపై మళ్లీ తమ మధ్య మ్యాచ్ జరగలేదన్నాడు. వింబుల్డన్ గ్రాండ్ లో నాల్గో రౌండ్ కు చేరిన క్రమంలో అండర్సన్ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని స్మరించుకున్నాడు. 'ఏబీతో టెన్నిస్ మ్యాచ్ ఆడి చాలా ఏళ్లు అయ్యింది. అతనికి 12 ఏళ్లు.. నాకు 10 ఏళ్ల వయసులో ఇద్దరం కలిసి ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో నన్ను ఏబీ ఓడించాడు. డివిలియర్స్ ఒక మంచి టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు ఏబీ దూరంగా ఉన్నాడు. మా మధ్య రీమ్యాచ్ కు ఇదే సమయం అనుకుంటున్నా'అని అండర్సన్ తెలిపాడు. అయితే అండర్సన్ విజ్ఞప్తికి ఏబీ తనదైన శైలిలో స్పందించాడు. నాల్గో రౌండ్ కు చేరిన అండర్సన్ కు ఆల్ ద బెస్ట్.. మన మధ్య రీమ్యాచ్ 30 నిమిషాల్లో ముగించేస్తా అంటూ ఏబీ ట్వీట్ చేశాడు. ఏబీ డివిలియర్స్ కు క్రికెట్ తో పాటు పలు క్రీడల్లో ప్రావీణ్యమున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టెన్నిస్ జూనియర్ సర్కిల్ లో ఏబీకి గుర్తింపు ఉంది. అయితే క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకోవడంతో మిగతా క్రీడల్ని ఏబీ వదులుకోవాల్సి వచ్చింది.