కేప్‌టౌన్: ఆఫ్రికా దేశాల్లోని చిన్నారుల విద్యా, క్రీడాభివృద్ధి కోసం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ ‘మ్యాచ్ ఇన్ ఆఫ్రికా’ పేరిట ఫెడరర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ వేదిక కేప్‌టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఏకంగా 51,954 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ టెన్నిస్ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షించడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 3–6, 6–3తో నాదల్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫెడరర్ ఫౌండేషన్ 35 లక్షల డాలర్లను (రూ. 25 కోట్లు) సేకరించడం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన ఫెడరర్ తల్లి లినెట్టి కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఏనాడూ ఫెడరర్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ ఆడలేదు. గత నవంబర్‌లో మెక్సికోలో ఫెడరర్, జ్వెరెవ్ (జర్మనీ) మ్యాచ్‌కు 42,517 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment