నాదల్‌ను నిలువరించేనా? | French Open Tourney Start From 27/10/2020 | Sakshi
Sakshi News home page

నాదల్‌ను నిలువరించేనా?

Published Sun, Sep 27 2020 2:57 AM | Last Updated on Sun, Sep 27 2020 2:57 AM

French Open Tourney Start From 27/10/2020 - Sakshi

పారిస్‌: ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహరాజు రాఫెల్‌ నాదల్‌ ఈసారీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధిస్తే రెండు ఘనతలు సాధిస్తాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ (20 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేయడంతోపాటు... ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 100 విజయాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. నేటి నుంచి మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ రెండు లక్ష్యాలు అధిగమించాలంటే నాదల్‌ ఎప్పటిలాగే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. తన పార్శ్వంలో ఉన్న గత ఏడాది రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను... మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాల్సి ఉంటుంది. ‘డ్రా’ ప్రకారమైతే నాదల్‌ ఇటీవల యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన థీమ్‌ను సెమీస్‌లో... ఈ ఏడాది ఓటమెరుగని జొకోవిచ్‌ ను ఫైనల్లో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 

2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న నాదల్‌కు అద్వితీయ రికార్డు ఉంది. 93 మ్యాచ్‌ల్లో నెగ్గిన అతను రెండు సార్లు (2009లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సోడెర్లింగ్‌చేతిలో; 2015 క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ చేతిలో) మాత్రమే ఓటమి చవిచూశాడు. గాయం కారణంగా 2016లో మూడో రౌండ్‌లో బరిలోకి దిగకుండానే ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. ఈసారి తొలి రౌండ్‌లో ఇగోర్‌ జెరాసిమోవ్‌ (బెలారస్‌)తో నాదల్‌ తలపడనున్నాడు. టైటిల్‌ సాధించే క్రమంలో ఏడు మ్యాచ్‌లు నెగ్గితే నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సరిగ్గా 100 విజయాలు పూర్తవుతాయి.

ఫెడరర్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లో 100 విజయాలు నమోదు చేసుకున్న ప్లేయర్‌గా నాదల్‌ నిలుస్తాడు. అంతేకాకుండా పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెడరర్‌ రికార్డును నాదల్‌ సమం చేస్తాడు. నాదల్‌తోపాటు రెండుసార్లు రన్నరప్‌ డొమినిక్‌ థీమ్, మాజీ విజేత జొకోవిచ్‌ కూడా టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఇటాలియన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచి జొకోవిచ్‌... యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి థీమ్‌ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా జ్వెరెవ్‌ (జర్మనీ), సిట్సిపాస్‌ (గ్రీస్‌), మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) కూడా మెరిపించే అవకాశముంది.

సెరెనా సత్తా చాటేనా...
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్‌ హలెప్‌ (రొమేనియా), సెరెనా విలియమ్స్‌ (అమెరికా), ముగురుజా (స్పెయిన్‌) టైటిల్‌ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆల్‌టైమ్‌ ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు సెరెనాకు మరో ‘గ్రాండ్‌’ టైటిల్‌ కావాలి. యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన సెరెనా ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పూర్తిస్థాయి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడంలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. 2015లో ఈ టైటిల్‌ నెగ్గి, 2016లో రన్నరప్‌ గా నిలిచిన సెరెనా ఆ తర్వాత రెండుసార్లు పాల్గొని నాలుగో రౌండ్‌ను దాటలేదు. డిఫెండింగ్‌ చాంపియన్, వరల్డ్‌ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement