పారిస్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి నిరాకరిస్తూ వస్తున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్ ఓపెన్ ఆడనివ్వమంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ జొకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడటానికి అనుమతి ఇవ్వమని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘ నో వ్యాక్సిన్.. నో ఫ్రెంచ్ ఓపెన్. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. జొకోవిచ్‌కు అయినా ఇదే రూల్. వ్యాక్సిన్ పాస్ రూల్ మేము అమలు చేయబోతున్నాం. ఇప్పటికే మాకు హెల్త్ పాస్ అనేది ఒకటి ఉంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అది ఏ రంగంలో సెలబ్రెటీ అయినా వర్తిస్తుంది’ అని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది మే 22వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది.
కాగా, అంతకముందు వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. దీంతో టైటిల్ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది.
అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment