లండన్: టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఇక వచ్చే ఏడాదే కోర్టులో దిగనున్నాడు. కరోనా సంక్షోభంతో ఇప్పుడైతే ఏ టెన్నిస్ టోర్నీలూ జరగట్లేదు కానీ వైరస్ అదుపులోకి వచ్చి పోటీలు జరిగినా తను మాత్రం ఆడలేనని ఫెడరర్ తెలిపాడు. 38 ఏళ్ల ఫెడరర్ కుడి మోకాలుకు ఈ ఫిబ్రవరిలో ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతనింకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఫ్రొఫెషనల్ సర్క్యూట్‌కు ఈ ఏడాదంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
‘కొన్ని వారాల క్రితం పునరావాస ప్రక్రియలో ఉండగానే ఇబ్బంది ఎదుర్కొన్నాను. దీంతో రెండో దశ పునరావాస శిబిరంలో ఉండాలనుకుంటున్నాను. పూర్తిగా వంద శాతం కోలుకున్నాకే కోర్టులో దిగుతాను. కాబట్టి 2020 సీజన్‌కు దూరంగా ఉంటాను’ అని ఫెడరర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మాత్రమే జరగ్గా... కరోనా విలయతాండవంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రద్దు చేశారు. గత నెలాఖర్లో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఆఖరి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ అయిన యూఎస్ ఓపెన్ కూడా ఆలస్యమైనా సరే నిర్వహించాలనే నిర్ణయంతో యూఎస్ వర్గాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment