మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది.
అయితే సానియా మీర్జా పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్ ఆడాలని భావించింది.
అందుకే రేపు హైదరాబాద్‌లో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సానియా మీడియాతో మాట్లాడుతూ.. ''అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారు. కెరీర్‌లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నా. విజయంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు తన కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయిస్తానని ఈ టెన్నిస్ దిగ్గజం చెప్పుకొచ్చింది.
ఇక ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడనుంది. సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలి రానున్నారు.
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్’గా వ్యవహరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment