
ఫైనల్లో ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్
కిషన్ పర్షాద్ నాకౌట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: కిషన్ పర్షాద్ వన్డే నాకౌట్ టోర్నీలో ఆంధ్రాబ్యాంక్ 153 పరుగుల తేడాతో ఏఓసీ జట్టుపై ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు మాత్రమే తలపడే ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ బౌలర్ లలిత్ మోహన్ (5/23) ఏఓసీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రాబ్యాంక్ 276 పరుగులు చేసి ఆలౌటైంది.
డీబీ రవితేజ (87), అమోల్ షిండే (72 నాటౌట్), అభినవ్ కుమార్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. ఏఓసీ బౌలర్ దివేశ్ పథానియా 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఏఓసీ 123 పరుగులకే ఆలౌటైంది. లలిత్ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. విష్ణు తివారి చేసిన 35 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ కాగా మిగతా వారు చేతులెత్తేశారు. మరో మ్యాచ్‌లో ఎస్‌బీహెచ్ జట్టు 7 వికెట్ల తేడాతో బీడీఎల్‌పై గెలిచింది.
తొలుత బీడీఎల్ జట్టు 198 పరుగుల వద్ద ఆలౌటైంది. కె.సుమంత్ (50) అర్ధసెంచరీ చేయగా, చైతన్య రెడ్డి 41, యతిన్ రెడ్డి 35 పరుగులు చేశారు. ఆకాశ్ భండారి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఎస్‌బీహెచ్ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి గెలిచింది. అహ్మద్ ఖాద్రీ (62 నాటౌట్), అనూప్ పాయ్ (52), డానీ డెరిక్ ప్రిన్స్ (51) చక్కని ప్రదర్శనతో జట్టును గెలిపించారు.