
రానున్న కాలంలో మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతోందని.. త్వరలోనే ఐపీఎల్ తరహా పోటీలను మహిళా క్రికెట్‌లో సైతం చూడవచ్చని భారత మహిళా క్రికెట్ జట్టు పూర్వపు క్రీడాకారిణి, ఆంధ్రా మహిళల సీనియర్ జట్టు కోచ్ డయానాడేవిడ్ పేర్కొన్నారు. కడప నగరంలో నవంబర్ 19 నుంచి నిర్వహిస్తున్న సీనియర్ మహిళల క్రికెట్ సన్నాహక శిబిరంలో ఆంధ్రా సీనియర్ మహిళలకు నైపుణ్యాలను, మెలకువులను నేర్పుతూ రంజీ మ్యాచ్‌లకు సన్నద్ధం చేస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా పలు విషయాలను పంచుకుంది. – కడప స్పోర్ట్స్
భారత మహిళా క్రికెట్ జట్టుకు మీరందించిన సేవలు?
భారత మహిళల క్రికెట్ జట్టుకు 2012 వరకు సేవలందించా. వన్‌డే మ్యాచ్‌లు, టీ–20 మొత్తం కలిపి 28 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించా. అనంతరం 2015 వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాను. హైదరాబాద్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించా.
దేశంలో మహిళా క్రికెట్ పరిస్థితి ఎలా ఉంది?
ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు భారత మహిళా జట్టు వెళ్లడంతో దేశప్రజల్లో మహిళల క్రికెట్ పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. రానున్న కాలంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్ అభివృద్ధి సాధిస్తుంది.
మహిళల క్రికెట్‌కు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి?
మహిళల క్రికెట్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చక్కటి ప్రోత్సాహం ఇస్తోంది. జోన్‌స్థాయిలో ఆడితే ఏడాదికి రూ.24 వేలు, రాష్ట్రస్థాయిలో ఆడితే రూ.48 వేల చొప్పున చెల్లిస్తోంది. దీనికి తోడు దేశంలోనే ప్రప్రథమంగా ఏసీఏ ఆధ్వర్యంలో మూలపాడులో మహిళల కోసం అకాడమీ ఏర్పాటు చేశారు. ఇది మహిళా క్రికెట్‌కు మేలు చేస్తుంది.
ఆంధ్రా మహిళల జట్టు పరిస్థితి ఎలా ఉంది?
ఆంధ్రా సీనియర్ మహిళల జట్టు చక్కటి కూర్పుతో ఉంది. సన్నాహక శిబిరం బాగా సాగుతోంది. ఈనెల 4 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో చక్కటి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నాం.
మహిళా క్రికెట్‌లోకి రావాలనుకునే క్రీడాకారిణులకుమీరిచ్చే సందేశం?
గతంతో పోల్చితే మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. దీంతో పాటు ఓ స్థాయి క్రికెట్ ఆడినా చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తుండడంతో క్రమేణా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. నిబద్ధత, అంకితభావంతో సాధన చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment