షటిల్ ఆడి ఈవెంట్ ను ప్రారంభిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్
సాక్షి, గుంటూరు: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాళ్లు అనికేత్ రెడ్డి, యశ్వంత్ రామ్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అనికేత్ రెడ్డి 15–10, 15–8తో అర్జున్ కృష్ణన్ (తమిళనాడు)పై గెలుపొందగా, యశ్వంత్ 15–11, 15–11తో ఉమంగ్ కౌశిక్ (ఉత్తరాఖండ్)పై నెగ్గాడు. మిగతా మ్యాచ్‌ల్లో వెంకట హర్షవర్ధన్ (ఏపీ) 4–15, 15–13, 15–10తో కవియరాసన్ (తమిళనాడు)పై, అనురాగ్ (ఏపీ) 15–1, 15–4తో హేమంత్ సింగ్ (కర్ణాటక)పై, పవన్ కుమార్ (ఏపీ) 16–14, 9–2తో సోహం నవందర్ (మహారాష్ట్ర)పై, దత్తాత్రేయ రెడ్డి (ఏపీ) 15–11, 15–7తో తుషార్ మక్కర్ (హరియాణా)పై, సాయి నాగ కోటేశ్వర్ (ఏపీ) 15–8, 15–6తో ఉమాకాంత్ సర్గే (మహారాష్ట్ర)పై, శరత్ (ఏపీ) 15–5, 15–3తో నితిన్ కుమార్ (హరియాణా)పై, సుమంత్ (ఏపీ) 15–4, 18–20, 15–10తో ఆశిష్ (తమిళనాడు)పై విజయం సాధించారు.
రోహన్ (మహారాష్ట్ర) 15–3, 15–4తో మురళీధర్ (ఏపీ)పై, వెళవన్ (తమిళనాడు) 15–5, 15–9తో ధీరజ్ (ఏపీ)పై గెలుపొందగా, యద్దనపూడి అమ్మన్న గౌడ్ (తెలంగాణ) వాకోవర్‌తో ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్ఞ (ఏపీ) 12–15, 15–12, 15–11తో అంతర దాస్ (తెలంగాణ)పై విజయం సాధించగా, శ్రేయ రెడ్డి (తెలంగాణ) 0–15, 3–15తో విభూతి శర్మ (ఢిల్లీ) చేతిలో, వన్షిక కపిల (తెలంగాణ) 15–11, 12–15, 13–15తో షాలిని శుక్లా (ఉత్తర ప్రదేశ్) చేతిలో, ప్రవళిక 3–15, 5–15తో ఆరుషి శర్మ (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో గోపాలకృష్ణ–ప్రీతి (తెలంగాణ) జోడి 15–4, 15–9తో వినోద్–అశ్రిత (తమిళనాడు) జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.