కొత్త కోచ్ ను ప్రకటించాల్సిందే!
ముంబై:భారత క్రికెట్ ప్రధాన కోచ్ అభ్యర్ధిని మంగళవారం సాయంత్రంలోగా ప్రకటించాల్సిందేనని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోచ్ అభ్యర్దికోసం ఇంటర్య్వూలు నిర్వహించినప్పటికీ, ఆ ప్రకటనను మాత్రం వాయిదా వేయడానికి వినోద్ రాయ్ తప్పుబట్టినట్లు సమాచారం..ఈ రోజు సాయంత్రానికల్లా కోచ్ అభ్యర్ధిని ప్రకటించాల్సిదేనని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..
ఈ మేరకు బీసీసీఐకి కోచ్ ప్రకటనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని సమాచారం. దానిలో భాగంగా బీసీసీఐ సీఈఏ రాహుల్ జోహ్రి, బీసీసీఐ కార్యదర్శి అమితామ్ చౌదరిలతో వినోద్ రాయ్ సమావేశమై కోచ్ అభ్యర్ధి ప్రకటించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సోమవారంగంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ (లండన్ నుంచి స్కైప్ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు.
కోచ్ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం'అని గంగూలీ తెలిపాడు.