ఆదివారం ఎస్జీఎం సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద వివేకానంద్,వెంకటేశ్వరన్, ఎంవీ శ్రీధర్,వెంకట్ రెడ్డి
హెచ్‌సీఏలో మరో రాజకీయం
ఎస్‌జీఎంలో తీవ్ర చర్చ
డిసెంబర్ 24న ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో వివాదాలు, సభ్యుల మధ్య రాజకీయాలు కొత్త కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కార్యవర్గం సమయం ముగిసిపోయింది కాబట్టి తప్పుకోవాలని ప్రత్యర్థి ఒక వైపు ఎప్పటినుంచో వాదిస్తుండగా, తాము నిబంధనల ప్రకారమే పదవీకాలం పొడిగించుకున్నట్లు అధికారంలో ఉన్నవారు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు లోధా కమిటీ సిఫారసుల అమలు తదనంతర పరిణామాలపై కూడా ఇరు వర్గాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఇది మళ్లీ బయటపడింది. లోధా కమిటీ ప్రతిపాదనల అమలు విషయంలో మరో చర్చకు తావు లేకుండా, ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసిన సభ్యులు, అందులోని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా రు. ఇది ఎలాంటి మలుపునకు దారి తీస్తుందనేది చూడాలి.
అమలుకు ఓకే...
ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశానికి దాదాపు 170 మంది సభ్యులు హాజరైనట్లు సమాచారం. అధ్యక్షుడు అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్‌లతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు ఇందులో పాల్గొన్నారు. మరో వైపునుంచి జి. వివేకానంద్, మాజీ కార్యదర్శి ఎంవీ శ్రీధర్ తదితరులు కూడా హాజరయ్యారు. ముందుగా నిర్ణరుుంచుకున్న అజెండా ప్రకారం అయూబ్, లోధా కమిటీ సిఫారసులను హెచ్‌సీఏ అమలు చేస్తుందని, దానిని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ప్రకటన చేశారు. అరుుతే అంశాలవారీగా చర్చను చేపట్టాలని కోరగా, దాని అవసరం లేదంటూ స్పష్టం చేస్తూ వేదిక దిగిపోయారు. ఇతర ఆఫీస్ బేరర్లు అయూబ్‌ను అనుసరించారు.
రద్దు చేసేస్తున్నాం...
అయితే అయూబ్ వెళ్లిపోయినా, ఇతర సభ్యులంతా ఉపాధ్యక్షుడు ప్రకాశ్ చంద్ జైన్ అధ్యక్షతన సమావేశం కొనసాగించారు. లోధా కమిటీ ప్రతిపాదనల్లో ఉన్న 14 అంశాలను సభ్యడు జి.వివేకానంద్ చదివి వినిపిస్తూ అంశాలవారీగా ఆమోదం కోరారు. హాజరైన సభ్యులంతా వీటికి మద్దతు పలికారు. ఈ సిఫారసుల ప్రకారం కొత్త నిబంధనలతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న కమిటీ రద్దరుునట్లేనని ఈ వర్గం ప్రకటించింది. అయూబ్ కూడా ఇప్పటికే 9 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆయనకు కొనసాగే అర్హత లేదని తేల్చేసింది. ఎన్నికల తేదీ, రిటర్నింగ్ అధికారి వివరాలు కూడా చెప్పాలని సభ్యులు కోరడంతో ప్రకాశ్ చంద్ డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అదేం చెల్లదు...
అయితే సభ్యుల వాదనను అయూబ్ అంగీకరించడం లేదు. ఎస్‌జీఎంలో ఏకై క ఎజెండా లోధా సిఫారసులు మాత్రమేనని, ఎన్నికల ప్రక్రియ అంశమే కాదన్న ఆయన... తన స్థానంలో మరొకరు అధ్యక్షత వహించి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని అన్నారు. ‘లోధా నిబంధనల్లో ఎక్కడా కమిటీ వెంటనే రద్దరుుపోతుందని లేదు. సుప్రీం ఆదేశాల ప్రకారం సిఫారసుల అమలుకు అంగీకారం తెలపడం మాత్రమే ప్రస్తుతం మేం చేయగలిగింది. ఇప్పుడే ఎన్నికలు అన్న ప్రసక్తే తలెత్తదు’ అని ఆయన గట్టిగా చెప్పారు. అయితే ఆదివారం సమావేశానంతరం ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపిస్తూ లోధా కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాయి. తాజా పరిణామాలపై అయూబ్, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరంపై ప్రత్యర్థి వర్గం లేఖ రాయనున్నాయి. వీటికి స్పందనగా లోధా కమిటీనుంచి సమాధానం వచ్చిన తర్వాతే హెచ్‌సీఏలో ఏం జరగనుందనే అంశంపై స్పష్టత రావచ్చు.