
వీళ్లతో జర జాగ్రత్త!
పసికూనే... కానీ ప్రమాదకరం
తొలిసారి ఆసియాకప్ ఆడబోతున్న అఫ్ఘానిస్థాన్
గత ఐదేళ్లలో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు కంటే వేగంగా అభివృద్ధి చెందిన జట్టు ప్రపంచంలో మరొకటి లేదు. 2009లో ఐసీసీలో ఎనిమిదో డివిజన్ మ్యాచ్‌లు ఆడిన జట్టు ఐదేళ్లలో ఆసియాకప్ ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. భారత్, పాకిస్థాన్, శ్రీలంకల మాదిరిగా బలమైన జట్టు కాకపోవచ్చు. కానీ ఎవరో ఒకరిని ఓడించే ప్రమాదకర జట్టు అఫ్ఘాన్. ఈ జట్టుతో మ్యాచ్‌లను ఏ మాత్రం తేలికగా తీసుకున్నా భంగపాటు తప్పదు.
సాక్షి క్రీడావిభాగం
క్రికెట్ ప్రపంచంలో అఫ్ఘానిస్థాన్ పసికూనే... అలాగని ఆ జట్టును తీసిపారేయలేం. ఎందుకంటే... 2010, 2012లలో వరుసగా రెండు టి20 ప్రపంచకప్‌లలో ఆ జట్టు ఆడింది. ఇది పెద్ద ఘనత. దీనికి మించిన పెద్ద ఘనత 2015 వన్డే ప్రపంచకప్‌కు ఆ జట్టు అర్హత సాధించడం. ఐదేళ్ల వ్యవధిలో ఆ జట్టు సాధించిన ప్రగతి చూసిన తర్వాత... అటు ఐసీసీ, ఇటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఆ జట్టును ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ఫలితంగా ఆసియాకప్‌లో ఆడే అవకాశం దక్కింది. నిజానికి 40 రోజుల క్రితం అప్ఘాన్ జట్టు కూడా ఆసియాకప్‌లో ఆడే అవకాశం తమకు లభిస్తుందని ఊహించలేదు. ఏదైతేనేం వన్డేల్లో తొలిసారి ఓ మెగా టోర్నీలో ఆడే అవకాశం ఆ జట్టుకు దక్కింది.
ఒక్కో మెట్టు ఎక్కుతూ...
అఫ్ఘానిస్థాన్‌కు క్రికెట్ కొత్త కాదు. పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రభావం కావచ్చేమో... దశాబ్దాలుగా వాళ్లకు ఈ ఆట పరిచయమే. అయితే అన్ని క్రీడల్లాగే తాలిబన్లు క్రికెట్‌పై కూడా నిషేధం విధించారు. కానీ ప్రజల్లో ఉన్న ఆసక్తిని గమనించి అదే తాలిబన్లు 2000లో నిషేధాన్ని ఎత్తివేశారు. తాలిబన్లు నిషేధం ఎత్తేసిన ఒకే ఒక్క క్రీడ క్రికెట్ కావడం విశేషం.దీంతో 2001లో అఫ్ఘానిస్థాన్‌ను ఐసీసీ అనుబంధ సభ్యదేశంగా గుర్తించింది. అప్పటి నుంచి ఐసీసీలో ఒక్కో డివిజన్ ఆడుతూ అడపాదడపా విజయాలతో 2007, 2008 నాటికి కాస్త క్రికెట్ ప్రపంచానికి తెలిసొచ్చింది. 2010 ఆ దేశ క్రికెట్‌కు పెద్ద మలుపు అనుకోవాలి. 2010లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.తర్వాత 2012లో శ్రీలంకలో జరిగిన టోర్నీలోనూ ఆడింది. తాజాగా వన్డేల్లో ప్రపంచకప్, ఆసియాకప్ ఆడబోతుండటం ఆ దేశ క్రికెట్ భవిష్యత్‌కు కీలక మలుపుగా భావించాలి. 27న పాకిస్థాన్‌తో అఫ్ఘాన్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.
తక్కువ అంచనా వేయలేం
అఫ్ఘానిస్థాన్ జట్టులో సత్తా ఉన్న ఆటగాళ్లకు ఏ మాత్రం కొదవలేదు. కెప్టెన్ నబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు కీలకం. వికెట్ కీపర్ షెహ్‌జాద్‌ను ఇప్పటికే అప్ఘాన్ ధోని అని పిలుస్తారు. ధోనిని తలపిస్తూ హెలికాఫ్టర్ షాట్స్ ఆడగలగడం షెహ్‌జాద్ ప్రత్యేకత. మరో ఓపెనర్ నౌరౌజ్ మంగళ్ కూడా నైపుణ్యం ఉన్న క్రికెటర్. పేసర్లు హమీద్ హసన్, షాపూర్ జద్రాన్ జట్టుకు కీలక బౌలర్లు. లెగ్ స్పిన్నర్ షమీయుల్లా ప్రమాదకర బౌలర్. కరీమ్ సాదిఖ్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ ఉపయుక్తకరమైన క్రికెటర్.
జట్టులో ఎవరూ 30 ఏళ్ల పైన వయసు ఉన్న వాళ్లు లేరు. అంతా యువరక్తం. దీనివల్ల కూడా జట్టు మైదానంలో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ జట్టులో ఏ ఒక్కరూ పెద్ద స్టార్ కాదు. జట్టు విజయాల్లో అందరిదీ తలా ఓ చెయ్యి ఉంది. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా కంగుతినిపించగల నైపుణ్యం వీరికి ఉంది. కాబట్టి ఆసియాకప్‌లో స్టార్ జట్లన్నీ అప్రమత్తంగా ఉండాల్సిందే.