రెహ్మాన్ మ్యూజిక్.. విరాట్ గాత్రం!
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సల్ కు అంబాసిడర్గా వ్యవరిస్తున్న టీమిండియా టెస్టు క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సరికొత్త పాత్రను పోషించడానికి సిద్ధమయ్యాడు. ఈ లీగ్కు సంబంధించిన అధికారిక గీతానికి విరాట్ తన గొంతుతో అలరించనున్నాడు. త్వరలో రూపుదిద్దుకోబోతున్న ఈ గీతానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తుండగా, విరాట్ తన గాత్రాన్ని ఇవ్వనున్నాడు.
భారత్లోని ఒక స్పోర్ట్స్ లీగ్కు సంబంధించి రెహ్మాన్ సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. దీనిపై రెహ్మాన్ మాట్లాడుతూ.. ప్రీమియర్ ఫుట్సల్ లీగ్ కు మ్యూజిక్ అందించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. మరోవైపు విరాట్ తో పని చేయడంపై కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నట్లు రెహ్మాన్ తెలిపాడు. అతని బ్యాట్ నుంచి ఏవిధంగా పరుగులు వస్తాయో, అదే విధంగా అతని గాత్రం నుంచి మెలోడి కూడా అంతే మధురంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తెలిపాడు.
ఇదిలాఉండగా, విరాట్ కూడా రెహ్మాన్తో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నట్లు పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి రెహ్మాన్ కు తాను పెద్ద అభిమానినంటూ విరాట్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15 వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు.