లండన్: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారడం మరొకటి. అది కూడా ఎంతలా అంటే ఆర్చర్‌కు సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేంతగా అభిమానుల్లో ఆసక్తికి దారి తీసింది. 2013లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో 16 పరుగులు, 6 బంతులు అని ఉండటమే చర్చనీయాంశమైంది.
తాజా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో భాగంగా ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో 15 పరుగులు చేసింది. అంటే న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరొక సందర్భంలో అంటే ఏడాది వ్యవధిలో ఆర్చర్ మరో ట్వీట్ చేశాడు. ‘ మేము లార్డ్స్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు. 2015లో మరొక ట్వీట్ చేస్తూ అందులో ‘సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. ఆర్చర్ చేసిన ఒకనాటి ట్వీట్లు ఇప్పటి వరల్డ్‌కప్‌కు దాదాపు సరిపోలడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
‘ ఆర్చర్ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘కాలజ్ఞాని, నిజమైన దేవుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘కలలు నిజం అంటే ఇదే. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నీలో సూపర్ నేచురల్ పవర్ ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు తాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారడం, అందుకు అభిమానుల్ని అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఒక ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు ఆర్చర్. 2019 వరల్డ్‌కప్ సీజన్‌లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment