ICC World Cup 2019 Final
-
మళ్లీ అదే స్టోక్స్.. 2019 వరల్డ్‌కప్ వివాదం గుర్తుకుతెచ్చేలా
2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓవర్ త్రో వివాదం అందరికి గుర్తుండే ఉంటుంది. ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్ కొంపముంచగా.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. అప్పటి ఓవర్ త్రో వివాదానికి కేంద్ర బిందువు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సేమ్ అలాంటి సీన్‌నే రిపీట్ అయింది. ఇప్పుడు కూడా స్టోక్స్ ఉన్నాడు.. అదీ ఇంగ్లండ్ కెప్టెన్‌గా. అప్పుడు వివాదానికి దారి తీస్తే.. ఇప్పుడు మాత్రం నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇంగ్లండ్ గెలవాలంటే మూడు బంతుల్లో 9 పరుగులు కావాలి. చివరి ఓవర్ బౌల్డ్ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని స్టోక్స్ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న మార్టిన్ గప్టిల్ రనౌట్‌కు అవకాశం ఉండడంతో ఓవర్ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్ బంతిని గమనించి క్రీజులోకి డైవ్ చేశాడు. ఈ క్రమంలో బ్యాట్‌కు తాకిన బంతి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వెళ్లింది. అయితే పైకి లేచిన స్టోక్స్.. మొకాళ్లపై కూర్చొని ''బ్యాట్‌కు బంతి తగిలడంతో బౌండరీ వెళ్లింది.. ఇందులో నా తప్పేం లేదని'' పేర్కొనడం వైరల్‌గా మారింది. ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తినగా.. అంపైర్ బౌండరీ సిగ్నల్ ఇవ్వడంతో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. ఆ తర్వాత మ్యాచ్ టై అవ్వడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. కాగా ఇంగ్లండ్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులోనూ అదే తరహా సీన్ మరోసారి రిపీట్ అయింది. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో జో రూట్ మిడ్ వికెట్ దిశగా ఆడి స్టోక్స్‌ను క్విక్ సింగిల్‌కు పిలిచాడు. స్టోక్స్ స్పందించినప్పటికి.. అప్పటికే ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసి వెనక్కి పరిగెత్తాడు. అయితే ఈ క్రమంలో రనౌట్ చేద్దామని భావించిన ఫీల్డర్ ఓవర్ త్రో వేయడం.. అచ్చం అప్పటి తరహాలోనే స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ మిడ్ వికెట్ మీదుగా పరుగులు పెట్టింది. అప్పటికే క్రీజులోకి వచ్చేసిన స్టోక్స్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈసారి బౌండరీ రాలేదు. వెంటనే స్టోక్స్ బౌల్ట్ పక్కన నిలబడి బ్యాట్‌కు తాకి బంతి అలా వెళ్లిందని.. తన తప్పేం లేదని సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన రూట్.. నా తప్పు కూడా ఏం లేదు అన్నట్లుగా స్టోక్స్‌ను అనుకరించడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో ఇంగ్లండ్ బోణీ కొట్టేలానే కనిపిస్తోంది. 77 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు కోసం ఇంగ్లండ్ మరో 61 పరుగులు చేయాల్సి ఉంది.రెండో ఇన్నింగ్స్‌లోనూ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ENG vs NZ 2022: విజయానికి 61 పరుగుల దూరంలో ఇంగ్లండ్ Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు We've Seen This Before 😁#Cricket #ENGvNZ #2019WorldCup #TrentBoult #BenStokes #joeroot pic.twitter.com/4Aqi6FTJfK — CRICKETNMORE (@cricketnmore) June 4, 2022 -
ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా!
New Zeland May Take Revenge On England For 2019 ODI World Cup Final Loss.. టి20 ప్రపంచకప్-2021 నాకౌట్ పోరుకు వచ్చింది. ఫైనల్ బరిలో నిలిచేందుకు నాలుగు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా ‘కప్’ వేటలో నిలిచేదెవరో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో తేలుతుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర సమరానికి అబుదాబి వేదిక కాగా... ఈ సారైనా ప్రపంచకప్ ముచ్చట తీర్చుకోవాలని న్యూజిలాండ్ తహతహలాడుతోంది. ఫైనల్లో ఆడుగుపెట్టేందుకు... ఇంగ్లండ్ అడ్డంకి తొలగించుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రధాన ఆటగాళ్లు జేసన్ రాయ్, టైమల్ మిల్స్ గాయాలతో దూరమవడాన్ని అనుకూలంగా మలచుకోవాలని, గత రెండు పరాజయాలకు గట్టి దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్ చూస్తోంది. బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ముందడుగు వేయాలనే నిశ్చయంతో ఉంది. డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ కాలిపిక్క గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. మరోవైపు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లోనే కాదు... గడిచిన 21 టి20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌దే పైచేయి. పొట్టి పోరులో కివీస్ ఏడు గెలిస్తే, ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. జోరు మీదున్న కివీస్ లీగ్ దశలో ఇంగ్లండ్ అన్నీ గెలిచి ఆఖరి మ్యాచ్‌లో ఓడితే... కివీస్ తొలి మ్యాచ్ ఓడాక మిగతావన్నీ గెలుస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంది. పైగా ప్రపంచకప్‌లకు అడ్డంకిగా మారిన ఇంగ్లండ్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో విలియమ్సన్ బృందం ఉంది. కెప్టెన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ, ఇన్నింగ్స్‌ను కుదుటపరుస్తూ జట్టును నడిపిస్తున్నాడు. ఓపెనింగ్‌లో గప్టిల్, మిచెల్ మెరుపుదాడి చేస్తే ఆఖరి ఓవర్లలో అదరగొట్టేందుకు... తడబడితే ఆదుకునేందుకు ఫిలిప్స్, నీషమ్‌లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్ తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. సౌతీ కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్ ఆరంభాన్ని చెదరగొడితే కివీస్ పట్టుబిగించడం ఖాయం. చదవండి: Virat Kohli: ఫెయిలయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్ అంటే కోహ్లినే ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ , న్యూజిలాండ్ మద్య మ్యాచ్ అనగానే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్. ఆ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అలా న్యూజిలాండ్‌కు వన్డే వరల్డ్‌కప్‌లో నిరాశే మిగిలింది. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్, వాతావరణం బ్యాటింగ్ పిచ్ ఇది. అఫ్గాన్‌పై భారత్ టోర్నీలోనే అత్యధిక 210/2 స్కోరు ఇక్కడే చేసింది. అందుకేనేమో కివీస్ స్పిన్నర్ సాన్‌ట్నర్ బౌలర్లకు కష్టమే అన్నాడు. వాతావరణంతో ఇబ్బంది లేదు. వాన ముప్పేమీ లేదు. చదవండి: T20 WC 2021: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ -
ఐసీసీ తీసుకున్న ఆ నిర్ణయం సూపర్: సచిన్
ముంబై: క్రికెట్లో సూపర్ ఓవర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ప్రపంచకప్ సెమీస్, పైనల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడిస్తామని ఐసీసీ సోమవారం స్పష్టం చేసింది. బోర్డు మీటింగ్‌లో పలు చర్చల అనంతరం ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ టై అయితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు. అయితే, ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్లు ఆడించాలని ఇంతకుముందే సూచించిన సచిన్.. నిబంధనలో సవరణ చేసినందుకు ట్విట్టర్ వేదికగా ఐసీసీని ప్రశంసించారు. ‘సూపర్ ఓవర్లు చాలా ముఖ్యం. రెండు జట్ల స్కోర్లు టై అయినపుడు ఫలితాన్ని నిర్ణయించడంలో ఇదే సరైన మార్గం. ఐసీసీకి ధన్యవాదాలు’ అని సచిన్ అభినందించాడు. ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీ లు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ను నిర్వహించాలని మాజీ క్రికెటర్లు చాలా మంది సూచించారు. ఇందులో సచిన్ కూడా ఉన్నాడు. దీంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సూపర్ ఓవర్ నిబంధనలపై ఐసీసీ ఓ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్ లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. -
ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్..
దుబాయ్: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా! న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య హోరాహోరీ పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇదీ ‘టై’ కాగా బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతను చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగు వేసింది. తాజాగా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ ‘టై’ అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని నిర్ణయించింది. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. కానీ... ఆ సూపర్ ‘టై’ అయితే మ్యాచ్‌ను ‘టై’గా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. జింబాబ్వే, నేపాల్ జట్లపై విధించిన నిషేధాన్ని కూడా ఐసీసీ ఎత్తేసింది. మహిళల మెగా ఈవెంట్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. టి20 ప్రపంచకప్ విజేతకు 10 లక్షల డాలర్లు (రూ.7 కోట్లు), రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3.5 కోట్లు) ఇస్తారు. వన్డే ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీని 3.5 మిలియన్ డాలర్లు (రూ.24.8 కోట్లకు) పెంచింది. 2021 నుంచి అండర్–19 మహిళల టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. -
ఓవర్ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్
క్రికెట్లో ఓవర్ త్రో సహజం. కానీ ఆ ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ను దూరం చేసింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిని బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు కేటాయించారు. ఈ ఓవర్ త్రో కివీస్ ఓటమికి ప్రధాన కారణమైంది. అయితే అంపైర్ ఆరు పరగులు కేటాయించడం పెద్ద వివాదస్పదమైంది. దీంతో మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) ఓవర్ త్రో నిబంధనలపై సమీక్ష చేపట్టింది. అయితే ఎమ్‌సీసీ సభ్యుడు, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రపంచకప్ ఫైనల్ ఓవర్‌త్రోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓవర్ త్రో నిబంధనలపై ఎమ్‌సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్‌సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను. ఫీల్డర్ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ శరీరానికి, బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ పరుగు కూడా తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్ జట్టు తప్పిదం వల్లనే రావాలి కానీ.. ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను కౌంట్ చేయోద్దు అనేది నా వాదన ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అయితే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. కానీ అందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నంబర్లు, పేర్లు ఉంటే అభిమానులు ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టవచ్చు’అంటూ వార్న్ పేర్కొన్నాడు. చదవండి: ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్ నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్ ఫైనల్ అంపైర్ -
ఆ సలహానే పని చేసింది: ఆర్చర్
లండన్: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ కప్ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు ఒకటైతే, అంపైరింగ్ నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. కివీస్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో భాగంగా 49 ఓవర్ నాల్గో బంతిని స్టోక్స్ లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టగా బౌండరీకి కొన్ని అంగుళాల ముందు బౌల్ట్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడంలో విఫలమై బౌండరీ లైన్ తొక్కాడు. దాంతో ఔట్ కాస్తా సిక్స్ అయిపోయింది. ఇక చివరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఓవర్ త్రో రూపంలో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ టై అయ్యింది. ఫలితంగా సూపర్ ఓవర్ ఇంగ్లండ్ 15 పరుగులు చేస్తే, కివీస్ కూడా అన్నే పరుగులు స్కోరును సమం చేసింది. కాకపోతే బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలా ఉంచితే, సూపర్ ఓవర్‌ను తనకు ఇవ్వడంపై ఒకింత ఆందోళనకు గురైనట్లు జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. ‘ నేను సూపర్ ఓవర్ వేయడానికి వెళ్లే ముందు స్టోక్స్ వచ్చి కూల్‌గా ఉండమని చెప్పాడు. నువ్వు గెలుపు-ఓటములు గురించి పట్టించుకోకు. అదేమే నీ ప్రతిభను తగ్గించదు అని ధైర్యం ఇచ్చాడు. ఆ సలహాతోనే నేను స్వేచ్ఛగా బౌలింగ్ వేశా. అదే సమయంలో జో రూట్ కూడా వచ్చి కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాడు. నాపై ప్రతీ ఒక్కరూ నమ్మకం ఉంచడంతోనే నేను బౌలింగ్‌ను నియంత్రణతో వేశా. నేను ఒకటే అనుకున్నా. ఒకవేళ మేము ఓటమి పాలైతే ప్రపంచం అక్కడితో ఆగిపోదు అనే విషయం నాకు తెలుసు’ ఆర్చర్ తెలిపాడు. ఇక నా రెండు నెలల ఇంగ్లండ్ కెరీర్లో ఇదే అత్యుత్తమమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఒకటైతే, వరల్డ్‌కప్‌లో జట్టులోకి రావడం, వరల్డ్‌కప్‌లో ఆడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నాడు. -
ఆర్చర్‌కు సూపర్ పవర్ ఉందా?
లండన్: నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్ వరల్డ్‌కప్ గెలవడం ఒకటైతే, ఆ దేశ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎప్పుడో ఆరేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారడం మరొకటి. అది కూడా ఎంతలా అంటే ఆర్చర్‌కు సూపర్ నేచురల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా అనేంతగా అభిమానుల్లో ఆసక్తికి దారి తీసింది. 2013లో ఆర్చర్ ఒక ట్వీట్ చేశాడు. అందులో 16 పరుగులు, 6 బంతులు అని ఉండటమే చర్చనీయాంశమైంది. తాజా వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో భాగంగా ఇంగ్లండ్ సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసింది. అంటే న్యూజిలాండ్ లక్ష్యం ఆరు బంతుల్లో 16 పరుగులు. మరి దీన్ని ముందే ఊహించే ఆర్చర్ ట్వీట్ చేశాడా అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరొక సందర్భంలో అంటే ఏడాది వ్యవధిలో ఆర్చర్ మరో ట్వీట్ చేశాడు. ‘ మేము లార్డ్స్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు. 2015లో మరొక ట్వీట్ చేస్తూ అందులో ‘సూపర్ ఓవర్‌ను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నాడు. ఆర్చర్ చేసిన ఒకనాటి ట్వీట్లు ఇప్పటి వరల్డ్‌కప్‌కు దాదాపు సరిపోలడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ ఆర్చర్ భవిష్యత్తుకు అతనే జ్యోతిష్కుడు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘కాలజ్ఞాని, నిజమైన దేవుడు’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘కలలు నిజం అంటే ఇదే. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. నీలో సూపర్ నేచురల్ పవర్ ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు. ఇలా ఆర్చర్ చేసిన ట్వీట్లు తాజా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారడం, అందుకు అభిమానుల్ని అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఒక ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు ఆర్చర్. 2019 వరల్డ్‌కప్ సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా నమోదైంది. -
అనూహ్యంగా వచ్చాడు.. టాప్ లేపాడు!
లండన్: జోఫ్రా ఆర్చర్.. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన జాబితాలో ఈ పేరు లేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే గాయపడితే ఆర్చర్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. వెస్టిండీస్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడి, ఆపై ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించడం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం. ప్రధానంగా ఇంగ్లిష్ కౌంటీల్లో సత్తాచాటడంతో ఆర్చర్ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే వరకూ ఈ క్రికెటర్ పేరు ఎవరికీ పెద్దగా కూడా తెలియదు. అయితే ఐపీఎల్లో ఫర్వాలేదనిపించినా, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు. ఏది ఏమైనా ఇంగ్లండ్ వరల్డ్‌కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నా ఆ జట్టు అంచనాల్ని నిజం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రధాన పేసర్ పాత్ర పోషిస్తూ వరల్డ్‌కప్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 2019 సీజన్లో 20 వికెట్లతో సత్తాచాటాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధికం. అదే సమయంలో మార్క్ వుడ్(18) రెండో స్థానంలో నిలిచాడు. ఒక వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధి వికెట్లు సాధించిన జాబితాలో ఆర్చర్, మార్క్ వుడ్‌ల తర్వాత స్థానాల్లో క్రిస్ వోక్స్(16 వికెట్లు, 2019 వరల్డ్‌కప్), ఇయాన్ బోథమ్(16 వికెట్లు, 1992 వరల్డ్‌కప్), ఆండ్రూ ఫ్లింటాఫ్(14 వికెట్లు, 2007 వరల్డ్‌కప్)లు ఉన్నారు. -
బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు!
లండన్: ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. మెగా ఫైట్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 242 లక్ష్య ఛేదనలో స్టోక్స్ అజేయంగా 84 పరుగులు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో కూడా స్టోక్స్ ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేశాడు. మరొకవైపు బట్లర్ 7 పరుగులు చేశాడు. కాగా, సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేయగా మళ్లీ మ్యాచ్ టై అయ్యింది. అయితే మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విశ్వ విజేతగా అవతరించింది. అయితే బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్‌కప్ ట్వీటర్ అకౌంట్లో పేర్కొంది. ఇంతవరకూ బాగానే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో స్టోక్స్ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇది భారత అభిమానులకు కోపం తెప్పించింది. ప్రధానంగా ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. ‘ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో తెలుసా’ అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘ సచిన్‌తో ఇంకొకరికి పోలిక.. అతనొక క్రికెట్ లెజెండ్, ఎవరు ఎన్ని చేసినా సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం’ అంటూ మరొకరూ విమర్శించారు. ‘ ఒకసారి ఆ ఇద్దరి గణాంకాలు చూస్తే ఎవరు ఆల్ టైమ్ గ్రేట్ అనేది అర్థమవుతుంది కదా’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. అసలు బెన్ స్టోక్స్‌కు అంత సీన్ లేదు. ఇలా పోస్ట్ చేసిన వాడ్ని చెప్పుతో కొట్టాలి’ అంటూ మరొక అభిమాని మండిపడ్డాఢు. -
మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్ ఆవేదన
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. .ఆదివారం అర్థరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్ టై కాగా, ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టైగానే ముగిసింది. దీంతో బౌండరీలను( సూపర్ ఓవర్‌తో సహా ఫోర్లు, సిక్సర్లు) లెక్కలోకి తీసుకున్న ఇంగ్లండ్‌నే వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించారు. ఇది ఆతిథ్య ఇంగ్లండ్‌కు అనుకూలంగా మారగా, గెలుపు తలుపు వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆవేదన మాత్రం వర్ణనాతీతం. కప్పు ఇంగ్లండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పుట్టెడు దుఖంలో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్( జిమ్మీ నీషమ్‌గా కూడా పిలుస్తారు) ట్వీటర్లో పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పిల్లలూ మీరెవరూ క్రీడల్లోకి రావొద్దు. మరి ఎదైనా ప్రొఫెషన్ తీసుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా ఆరోగ్యంగా చనిపోండి’ అంటూ జిమ్మీ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌కు అభినందనలు తెలియజేశాడు నీషమ్. జిమ్మీ నీషమ్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. న్యూజిలాండ్ అభిమానులే కాదు.. భారత క్రికెట్ అభిమానులు సైతం నీషమ్‌ను ఓదార్చుతున్నారు. మీరు ఆడిన తీరు... ఎవరూ మరిచిపోలేరని అండగా నిలుస్తున్నారు. Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy. — Jimmy Neesham (@JimmyNeesh) 15 July 2019 -
డీఆర్ఎస్ లేకుంటే బలైపోయేవారే..!
లండన్: ప్రపంచ క్రికెట్లో డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)ని ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్ఎస్లో హాక్ ఐ (బాల్ ట్రాకింట్ టెక్నాలజీ), హాట్ స్పాట్(బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్ అంపైర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్లో ఒక జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్రమంలో ఒక రివ్యూనే ఉంటుంది. దాన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలనేది అక్కడ ఉండే పరిస్థితిపైనే ఉంటుంది. ఒకసారి రివ్యూకు కోల్పోతే మళ్లీ చాన్స్ ఉండదు. అదే సమయంలో రివ్యూకు సక్సెస్ అయితే అది అలానే ఉంటుంది. మరొకవైపు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది. కాగా, ఆదివారంతో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో డీఆర్ఎస్ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్ఎస్ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్ అలన్ కెటల్‌బారో(ఇంగ్లండ్ అంపైర్) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో రిచర్డ్ అలన్ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్ఎస్లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్ గాఫనీ(న్యూజిలాండ్ అంపైర్), పాల్ విల్సన్(ఆస్ట్రేలియా అంపైర్), రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్ తప్పిదాలు చేశారు. ఆసీస్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇలానే బలైపోయాడు. కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్ పెవిలియన్ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్ ఇక చేసేదేమీ లేకపోయింది. ఇదొక ఉదాహరణే అయినా, ఇంకా ఇటువంటివి చాలనే ఉన్నాయి. డీఆర్ఎస్ విధానం ఉండగానే ఇన్ని తప్పిదాలు జరిగితే.. అసలు అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి లేకుంటే మాత్రం అధిక సంఖ్యలో ఆటగాళ్లు కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు బలైపోయేవారనేది కాదనలేని సత్యం. -
టామ్ లాథమ్ నయా రికార్డు
లండన్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ నయా రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మెగా ఫైట్‌లో లాథమ్ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన కీపర్‌గా ఆడమ్ గిల్ క్రిస్ట్(ఆస్ట్రేలియా) సరసన చేరిపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో లాథమ్ 21 ఔట్లలో భాగస్వామ్యమైతే, అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో గిల్ క్రిస్ట్ కూడా సరిగ్గా 21 ఔట్లలో భాగస్వామ్యం అయ్యాడు. ఈ జాబితాలో గిల్ క్రిస్ట్, లాథమ్‌ల తర్వాత స్థానాల్లో అలెక్స్ క్యారీ(20, 2019 వరల్డ్‌కప్), కుమార సంగక్కరా(17, 2003 వరల్డ్‌కప్)లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో జేసన్ రాయ్, జో రూట్, క్రిస్ వోక్స్ క్యాచ్‌లను లాథమ్ అందుకున్నాడు.ఇరు జట్ల మధ్య జరిగిన తుది పోరులో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌తో పాటు, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఓవరాల్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. -
జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్
లండన్ : వరల్డ్‌కప్ 2019 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యద్భుత పోరు. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమాని ఊహకందని విషయం. అయితే మ్యాచ్‌ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ ఓవర్లో ఇంగ్లాండ్ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాలి. కప్పు గెలవడానికి న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు. ఆ బంతిని స్టోక్స్ ఫోర్ కొట్టాలని చూశాడు. బంతి గప్తిల్‌కు దొరికింది. త్రో విసిరాడు.. క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్ బ్యాటుకు తాకకపోయి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కప్పు న్యూజిలాండ్‌ను వరించేదేమో. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లండ్‌కు కలిసి వచ్చాయి. ఇంగ్లండ్ విజయం తర్వాత బెన్ స్టోక్స్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు. అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అన్నాడు . ఇది తాను కావాలని చేసింది కాదని.. బాల్ అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. ఇందుకు కేన్‌కు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని.. ఎన్నో మాటలు పడిందన్నాడు స్టోక్స్. చివరకూ తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని తాను భావించడం లేదన్నాడు స్టోక్స్. -
‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’
లండన్ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. మ్యాచ్, సూపర్ ఓవర్ టైగా మారినప్పటికి.. సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ వరుసగా రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్ ఓటమితో కివీస్ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఓటమిపై న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ టీంకు ధన్యవాదాలు. మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్‌లు మేం అనుకున్నదాని కంటే భిన్నంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు. ‘ఇది కేవలం ఒక్క ఎక్స్ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్ ఫోర్ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్ త్రో విసిరాడు. అయితే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలియమ్సన్. -
ప్రపంచకప్ 2019: పుట్టినింటికే చేరింది
ప్రపంచకప్ ఫైనల్ పోరు ఎలా ఉండాలని అభిమాని కోరకుంటాడో అంతకుమించి జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ. ఇరుజట్ల మధ్య దోబుచులాడిన విజయం. చివరికి క్రికెట్ పుట్టినింటికే ప్రపంచకప్ చేరింది. కాదు ఇంగ్లండ్ గెలుచుకుంది. మొదట ఇరు జట్ల స్కోర్లు సమం. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ అదే ఫలితం. అయితే సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్ ఒకే ఒక సిక్సర్ కొట్టింది. దీంతో జగజ్జేతగా ఇంగ్లండ్ నిలిచింది. పాపం వరుసగా రెండో సారి కూడా న్యూజిలాండ్‌కు రిక్త హస్తమే మిగిలింది. ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిందంటే ఏకైక కారణం బెన్ స్టోక్స్. మిడిలార్డర్ బలంగా ఉంటేనే ఏ మెగా టోర్నీనైనా గెలువచ్చని తాజా ప్రపంచకప్ మరోసారి నిరూపించింది. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్, రైనా.. 2015 ప్రపంచకప్‌లో స్టీవ్ స్మిత్, క్లార్క్.. 2019 ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్లు తమ జట్లు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్ అద్వితీయమైన ఆటతో జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. కీలక ఫైనల్ మ్యాచ్‌లో అందరూ విఫలమైనా తానోక్కడే చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. లండన్ : తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం. అనంతరం సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం అయ్యాయి. అయితే సూపర్ ఓవర్లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఇంత థ్రిల్లింగ్‌గా సాగింది. తొలుత కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు సమంగానే స్కోర్లు నమోదు చేశాయి. ఇంగ్లండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం జట్టుకు అద్భుత విజయాలను అందించిన కేన్ విలియమ్సన్‌కే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లభించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడింది. ఎంతటి భారీ స్కోర్లనైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌లో 242 పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడింద. కివీస్ అద్భుత బౌలింగ్‌తో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బెన్ స్టోక్స్ (84 నాటౌట్; 98 బంతుల్లో, 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు చివరి వరకు ఉండి కివీస్‌ను ప్రతిఘటించాడు. స్టోక్స్‌కు తోడుగా బట్లర్(59; 60 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గుసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో నికోలస్(55), లాథమ్(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. విలియమ్సన్(30) ఫర్వాలేదనిపించాడు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి కివీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఫైనల్ అప్డేట్స్: విశ్వవిజేతగా ఇంగ్లండ్
లండన్ : నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరికి ఇంగ్లండ్‌నే విజయం వరించింది. తొలుత స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్లో కూడా ఇరుజట్ల స్కోర్ సమం కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బౌల్ వేసిన ఓవర్లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్, బట్లర్లు బౌల్ట్ బౌలింగ్‌ల్ ఎదురుదాడికి దిగారు. దీంతో అవలీలగా 15 పరుగులు రాబట్టారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేలనుంది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ 14 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. నరాలు తెగే ఉత్కంఠ. విజయం ఇరువురి జట్ల మధ్య దోబుచూలాడుతోంది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 15 పరుగులు సాధించాలి. క్రీజులో బెన్ స్టోక్స్(70), రషీద్(0)లు ఉన్నారు. విజయం ఇరువురి మధ్య దోబుచులాడుతోంది. ఇంగ్లండ్ ఆశలన్నీ స్టోక్స్‌పైనే ఉన్నాయి. కీలకసమయంలో స్వల్ప వ్యవధిలో ఇంగ్లండ్ రెండు వికెట్లను చేజార్చుకుంది. బట్లర్(55), వోక్స్(2)లు వెంటవెంటే ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్ విజయావకాశాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పైనే ఉన్నాయి. ఇంగ్లండ్‌కు షాక్. కీలక సమయంలో జోస్ బట్లర్(59) ఔటయ్యాడు. ఫెర్గుసన్ బౌలింగ్‌లో బట్లర్ భారీ షాట్ ఆడాడు. అయితే టిమ్ సౌథీ కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో బట్లర్ వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 110 పరుగుల భాగస్మామ్యానికి తెరపడింది. స్టోక్స్(51), వోక్స్(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బట్లర్లు కీలక సమయంలో తామేంటో నిరూపించుకున్నారు ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వీర్దిదరూ అర్దసెంచరీలతో ఆకట్టుకున్నారు. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను బట్లర్-స్టోక్స్‌లు ఆదుకున్నారు. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వికెట్ కీపర్ బట్లర్‌ల సూపర్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ విజయం వైపు అడుగులు వేస్తోంది. 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఈ జంట ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటికే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 60 బంతుల్లో 72 పరుగులు సాధించాలి. ఇప్పటికైతే ఇరుజట్లకు విజయావకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గుసన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో ఇయాన్ మోర్గాన్(9) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 24 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్(5), బట్లర్(2) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. ఫెర్గుసన్ బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్న బెయిర్ స్టో(36) దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. దీంతో 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రాయ్(17), రూట్(7)లు తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్(8), స్టోక్స్(1)లు ఉన్నారు. ఆరంభంలోనే జాసన్ రాయ్ వికెట్ కోల్పోవడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్, బెయిర్ స్టోలు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. బెయిర్ స్టో (20; 36 బంతుల్లో), రూట్(3; 22 బంతుల్లో)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌కు షాక్.. రాయ్ ఔట్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్(17)ను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. దీంతో 28 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. రాయ్ అవుటవ్వడంతో రూట్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం బెయిర్ స్టో 14 పరుగులతో, రూట్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. తొలి బంతికే రివ్యూ తీసుకున్న కివీస్ తొలి బంతికే రివ్యూ తీసుకుని న్యూజిలాండ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కివీస్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే అదృష్టం కలిసొచ్చింది. ట్రెంట్బోల్ట్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి జాసన్ రాయ్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. కివీస్ రివ్యూకి వెళ్లగా అంపైర్ కాల్ వచ్చింది. దీంతో రాయ్ బతికిపోయాడు. ఇంగ్లండ్ లక్ష్యం 242 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సాదారణ స్కోర్‌కే పరిమితమైంది. హెన్రీ నికోలస్(55), టామ్ లాథమ్(47) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. టామ్ లాథమ్(47)ను క్రిస్ వోక్స్ స్లోబాల్‌తో బోల్తా కొట్టించాడు. దీంతో చివరి వరకు ఉండి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తాడునుకున్న లాథమ్ కూడా ఔట్ కావడంతో కివీస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. న్యూజిలాండ్ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ దారిలోనే గ్రాండ్‌హోమ్(16)కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం గ్రాండ్‌హోమ్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. పోరాడుతున్న లాథమ్ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ ఆకట్టుకుంటున్నాడు. హెన్నీ నికోలస్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట లాథమ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లాథమ్(41)తో పాటు గ్రాండ్‌హోమ్(13) క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన కివీస్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. జేమ్స్ నీషమ్(19)ను ఫ్లంకెట్ ఔట్ చేయడంతో 173 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 70 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను పడగొట్టిన ఇంగ్లండ్ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ప్రస్తుతం టామ్ లాథమ్(23)తో పాటు గ్రాండ్ హోమ్(4) క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఫ్లంకెట్ మూడు వికెట్లతో రాణించగా..వుడ్, వోక్స్‌లు తలో వికెట్ పడగొట్టారు. టేలర్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్ నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కివీస్ స్కోరు 141 పరుగుల వద్ద ఉండగా రాస్ టేలర్(15) పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 34 ఓవర్ తొలి బంతికి టేలర్ ఔటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో టేలర్ ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. లాథమ్(11), జేమ్స్ నీషమ్(0)లు క్రీజ్‌లో ఉన్నారు. నికోలస్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్దసెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న నికోలస్(55)ను ప్లంకెట్ బౌల్డ్ చేశాడు. ఇప్పటికే విలియమ్సన్‌ను ఔట్ చేసిన ప్లంకెట్.. నికోలస్‌ను కూడా ఔట్‌చేసి కివీస్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కివీస్ 27 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(6), లాథమ్(0)లు ఉన్నారు. నికోలస్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హెన్రీ నికోలస్ అర్దసెంచరీ సాధించాడు. 71 బంతుల్లో నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మార్టిన్ గప్టిల్(19), విలియమ్సన్(30)లు నిరాశపరిచినప్పటికీ నికోలస్ బాధ్యతాయుతంగా ఆడాడు. తొలి వికెట్‌కు 29, పరుగులు రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. విలియమ్సన్ ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. సారథి విలియమ్సన్(30)ను ఫ్లంకెట్ను ఔట్ చేసి కివీస్‌ను కష్టాల్లో పడేశాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్ స్వల్పస్కోర్‌కే వెనుదిరగడం కివీస్ ఎదురుదెబ్బే. ఇక సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఇన్నింగ్స్‌పైనే కివీస్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం కివీస్ 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నికోలస్ 46 పరుగులతో, టేలర్ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. అర్దసెంచరీ భాగస్వామ్యం ఓపెనర్ హెన్రీ నికోలస్‌తో కలిసి కేన్ విలియమ్సన్ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 29 పరుగులకే మార్టిన్ గప్టిల్(19) వికెట్ కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. అయితే ఈ తరుణంలో నికోలస్‌తో కలిసి విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. నికోలస్ 40 పరుగులతో, విలియమ్సన్ 24పరుగులతో క్రీజులో ఉన్నారు. విలియమ్సన్ రికార్డు ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డు సాధించాడు. ఒక ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్దనే(548, 2007 ప్రపంచకప్‌లో) రికార్డును విలియమ్సన్ తాజాగా బద్దలుకొట్టాడు. కివీస్ 15 ఓవర్లు 63/1 ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 27 పరుగులతో, విలియమ్సన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో విలియమ్సన్, నికోలస్లు ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ 10 ఓవర్లలో 33/1 ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం నికోలస్ 10 పరుగులతో, విలియమ్సన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలోనే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్లు ఆదిరే ఆరంభాన్ని అందించలేదు. గప్టిల్ ఔట్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 29 పరుగులకే కివీస్ కీలక వికెట్‌ను కోల్పోయింది. గప్టిల్ ఔటవ్వడంతో విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. సిక్సర్, ఫోర్‌తో మెరిసిన గప్టిల్ ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మెరవని మార్టన్ గప్టిల్ ఫైనల్ మ్యాచ్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో గప్టిల్ ఫామ్‌లోకి వచ్చాడని కివీస్ అభిమానులు ఆనందపడుతున్నారు. రివ్యూతో బతికిపోయిన నికోలస్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో రివ్యూతో న్యూజిలాండ్ ఓపెనర్ నికోలస్ బతికిపోయాడు. వోక్స్ వేసిన మూడో ఓవర్ మూడో బంతి నికోలస్ ప్యాడ్లకు తగిలడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ధర్మసేన ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నికోలస్ రివ్యూకు వెళ్లాడు. బంతి వికెట్‌ను మిస్ అవుతుండటంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. వైడ్‌తో ఫైనల్ మ్యాచ్ పారంభం వైడ్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. క్రిస్ వోక్స్ వేసిన తొలి ఓవర్ తొలి బంతి వైడ్ కావడంతో న్యూజిలాండ్‌కు అదనంగా ఒక పరుగు లభించింది. ఇక టాస్ గెలిచి కివీస్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో మార్టిన్ గప్టిల్, నికోలస్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కప్ కొట్టాల్సిన మ్యాచ్‌లో మార్గిన్ గప్టిల్ రాణించాలని కివీస్ కోరుకుంటుంది. అతడి రాణిస్తే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని కివీస్ ఆరాటపడుతోంది. ఈసారి వన్డే వరల్డ్‌కప్‌లో కొత్త చాంపియన్ అవతరించబోతోంది. ఒకటి అందరూ టైటిల్ ఫేవరెట్‌గా పేర్కొన్న జట్టు ఇంగ్లండ్ కాగా టోర్నీ మధ్యలో కొంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్. ఈ రెండు జట్లు మెగా టైటిల్ పోరులో తలపడుతున్నాయి. క్రికెట్‌కు పుట్టినిల్లయినా.. ఒకటికి మూడు సార్లు ఫైనల్ చేరినా.. ఇప్పటిదాకా ప్రపంచకప్ కల తీరని జట్టు ఇంగ్లండ్‌ది. ఇంకొకటి పెద్దగా అంచనాల్లే కుండా బరిలోకి దిగి.. లీగ్ దశలో డక్కామొక్కీలు తిని.. కష్టం మీద నాకౌట్‌కు చేరి.. సెమీస్‌లో బలమైన భారత జట్టుకు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్. ప్రపంచ కప్‌లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసే ఆ జట్టుకు.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షే. ఒకసారి ఫైనల్ ఆడింది. కానీ కప్పు అందలేదు. మరికొద్ది గంటల్లో ఇరు జట్ల దశాబ్దాల నిరీక్షణకు ఆదివారం తెరపడబోతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తుది సమరంలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్ల బలాబలాలు చూస్తే న్యూజిలాండ్ కన్నా ఇంగ్లండ్ కొన్ని మెట్లు పైనే ఉంది. బ్యాటింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం. జేసన్ రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్.. ఇలా భీకరమైన లైనప్ ఉందా జట్టుకు. లీగ్ దశ మధ్యలో తడబాటుకు గురైనప్పటికీ.. నాకౌట్ అవకాశాలు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకున్నారు. చివరి మూడు మ్యాచ్‌ల్లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌కు బ్యాటింగే సమస్యగా ఉంది. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ బ్యాట్స్‌మన్ గప్తిల్ టోర్నీ మొత్తంలో 167 పరుగులే చేశాడు. కివీస్ ఫైనల్ వరకు వచ్చిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ పోరాట ఫలితమే. మిడిలార్డర్లో టేలర్, నీషమ్ ఓ మోస్తరుగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి. బౌల్ట్, హెన్రీ, ఫెర్గూసన్, శాంట్నర్ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సెమీస్‌లో హెన్రీ, బౌల్ట్, శాంట్నర్ ఎలా విజృంభించారో తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లు టోర్నీ ఆరంభంలో సాధారణంగా కనిపించారు కానీ.. తర్వాత పుంజుకున్నారు. ఆర్చర్, వోక్స్, రషీద్ మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఏది ఏమైనా ఇరు జట్లు తొలిసారి వరల్డ్‌కప్‌ను సాధించడానికి శాయశక్తుల పోరాడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆసక్తికర సమరం ఖాయం. -
మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత
లండన్: న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో హెన్రీ మొదటి పవర్ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో భాగంగా జేసన్ రాయ్ వికెట్‌ను సాధించడం ద్వారా హెన్రీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్ నాల్గో బంతికి రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ జాబితాలో కాట్రెల్(వెస్టిండీస్), జోఫ్రా ఆర్చర్( ఇంగ్లండ్), క్రిస్ వోక్స్( ఇంగ్లండ్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) కివీస్ నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన రాయ్.. హెన్రీకి చిక్కాడు. ఆపై జానీ బెయిర్ స్టోకు లైఫ్ లభించింది. బెయిర్ స్టో ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను గ్రాండ్ హోమ్ వదిలేశాడు. -
ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్ 242 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. హెన్రీ నికోలస్(55; 77 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, టామ్ లాథమ్(47; 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్(30; 53 బంతుల్లో 2 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గప్టిల్(19) మరోసారి నిరాశపరిచాడు. ఆ తరుణంలో నికోలస్‌తో కెప్టెన్ విలియమ్సన్ జత కలిశాడు. వీరిద్దరూ 74 పరుగులు సాధించిన తర్వాత విలియమ్సన్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ప్లంకెట్ బౌలింగ్‌లో కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. (ఇక్కడ చదవండి: కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు) దాంతో 103 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో నికోలస్ మూడో వికెట్‌గా ఔట్ కాగా, రాస్ టేలర్(15) విఫలమయ్యాడు. కాగా, లాథమ్ ఆదుకోవడంతో కివీస్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే నీషమ్‌తో కలిసి 32 పరుగులు జత చేసిన లాథమ్.. గ్రాండ్ హోమ్‌తో కలిసి 46 పరుగులు భాగస్వామ్యం సాధించాడు. కాగా, 48.3 ఓవర్లలో కివీస్ స్కోరు 232 పరుగుల వద్ద లాథమ్ ఏడో వికెట్‌గా ఔట్ కాగా, ఆ తర్వాత 9 పరుగుల్ని మాత్రమే వచ్చాయి. దాంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్లు తలో మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు చెరో వికెట్ తీశారు. మరి కివీస్ నిర్దేశించిన సాధారణ టార్గెట్‌ను ఇంగ్లండ్ ఛేదిస్తుందా.. లేక చతికిలబడుతుందా అనేది చూడాలి. -
కేన్ విలియమ్సన్ వరల్డ్ రికార్డు
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త వరల్డ్ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తుది పోరులో విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తన పరుగుల ఖాతాను తెరవడం ద్వారా విలియమ్సన్ అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే రికార్డును విలియమ్సన్ బ్రేక్ చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఇదే ఇప్పటివరకూ వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్సీ రికార్డు. దాన్ని తాజాగా విలియమ్సన్ సవరిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించాడు. 2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ సాధించిన పరుగులు 578. ఈ జాబితాలో విలియమ్సన్, జయవర్థనే తర్వాత స్థానాల్లో రికీ పాంటింగ్(539 పరుగులు, 2007), అరోన్ ఫించ్(507 పరుగులు, 2019), ఏబీ డివిలియర్స్( 482 పరుగులు, 2015)లు ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 465 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరే క్రమంలో గంగూలీ ఈ పరుగులు చేశాడు.