లండన్ : వరల్డ్‌కప్ 2019 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యద్భుత పోరు. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమాని ఊహకందని విషయం. అయితే మ్యాచ్‌ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ ఓవర్లో ఇంగ్లాండ్ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాలి. కప్పు గెలవడానికి న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు.
ఆ బంతిని స్టోక్స్ ఫోర్ కొట్టాలని చూశాడు. బంతి గప్తిల్‌కు దొరికింది. త్రో విసిరాడు.. క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్ బ్యాటును తాకి బంతి ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్ బ్యాటుకు తాకకపోయి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కప్పు న్యూజిలాండ్‌ను వరించేదేమో. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లండ్‌కు కలిసి వచ్చాయి. ఇంగ్లండ్ విజయం తర్వాత బెన్ స్టోక్స్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు.
అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అన్నాడు . ఇది తాను కావాలని చేసింది కాదని.. బాల్ అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. ఇందుకు కేన్‌కు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. అయితే ఈ గెలుపు కోసమే తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని.. ఎన్నో మాటలు పడిందన్నాడు స్టోక్స్. చివరకూ తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరోటి ఉంటుందని తాను భావించడం లేదన్నాడు స్టోక్స్.
Comments
Please login to add a commentAdd a comment