ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్‌లో ‘ఓవర్ త్రో’కు ఆరు పరుగులు కేటాయించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ‘ఓవర్ త్రో’కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని తాను ఎంపైర్‌తో చెప్పినట్టు వచ్చిన కథనాలపై తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అంపైర్ వద్దకు వెళ్లి.. అదనపు నాలుగు పరుగులు వద్దని కోరినట్టు వచ్చిన కథనాలన్నీ వదంతులేనని అతను తేల్చిచెప్పాడు. బీబీసీ పొడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన స్టోక్స్.. గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్తున్నా. నేను ఎంపైర్ వద్దకు వెళ్లి.. అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ టామ్ లాథమ్ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగానని, అలాగే కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను క్షమించమని కోరానని వెల్లడించాడు.
ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్‌లో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా.. అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు విమర్శించారు కూడా. అయితే, నిజానికి స్టోక్స్.. ఆ ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించడంతోపాటు.. అసలు అదనపు పరుగులు వద్దని స్టోక్స్ వేడుకున్నా అంపైర్లు వినిపించుకోలేదని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఈ కథనాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment