ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది | World Cup 2019 England Create history at Lords | Sakshi
Sakshi News home page

విశ్వవిజేతగా ఇంగ్లండ్‌

Published Mon, Jul 15 2019 12:31 AM | Last Updated on Mon, Jul 15 2019 12:54 AM

World Cup 2019 England Create history at Lords - Sakshi

ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు ఎలా ఉండాలని అభిమాని కోరకుంటాడో అంతకుమించి జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ. ఇరుజట్ల మధ్య దోబుచులాడిన విజయం. చివరికి క్రికెట్‌ పుట్టినింటికే ప్రపంచకప్‌ చేరింది. కాదు ఇంగ్లండ్‌ గెలుచుకుంది. మొదట ఇరు జట్ల స్కోర్లు సమం. అనంతరం నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లోనూ అదే ఫలితం. అయితే సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్‌ రెండు బౌండరీలు కొట్టగా.. కివీస్‌ ఒకే ఒక సిక్సర్‌ కొట్టింది. దీంతో జగజ్జేతగా ఇంగ్లండ్‌ నిలిచింది. పాపం వరుసగా రెండో సారి కూడా న్యూజిలాండ్‌కు రిక్త హస్తమే మిగిలింది.

ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిందంటే ఏకైక కారణం బెన్‌ స్టోక్స్‌. మిడిలార్డర్‌ బలంగా ఉంటేనే ఏ మెగా టోర్నీనైనా గెలువచ్చని తాజా ప్రపంచకప్‌ మరోసారి నిరూపించింది. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్‌, రైనా.. 2015 ప్రపంచకప్‌లో స్టీవ్‌ స్మిత్‌, క్లార్క్‌.. 2019 ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌లు తమ జట్లు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా జరిగిన ప్రపంచకప్‌లో బెన్‌ స్టోక్స్‌ అద్వితీయమైన ఆటతో జట్టుకు అపూర్వ విజయాలను అందించాడు. కీలక ఫైనల్‌ మ్యాచ్‌లో అందరూ విఫలమైనా తానోక్కడే చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు.   

లండన్‌ : తొలుత ఇరుజట్ల స్కోర్లు సమం. అనంతరం సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమం అయ్యాయి. అయితే సూపర్‌ ఓవర్‌లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. దీంతో తొలిసారి ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌ మ్యాచ్‌ ఇంత థ్రిల్లింగ్‌గా సాగింది. తొలుత కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా ఇరు జట్లు సమంగానే స్కోర్లు నమోదు చేశాయి. ఇంగ్లండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. సిరీస్‌ ఆసాంతం జట్టుకు అద్భుత విజయాలను అందించిన కేన్‌ విలియమ్సన్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది. 

లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ తడబడింది. ఎంతటి భారీ స్కోర్లనైనా అవలీలగా ఛేదించిన ఇంగ్లండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 242 పరుగులు సాధించడానికి ఆపసోపాలు పడింద. కివీస్‌ అద్భుత బౌలింగ్‌తో పాటు కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బెన్‌ స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో, 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు చివరి వరకు ఉండి కివీస్‌ను ప్రతిఘటించాడు. స్టోక్స్‌కు తోడుగా బట్లర్‌(59; 60 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. కివీస్‌ బౌలర్లలో నీషమ్‌, ఫెర్గుసన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్‌ ఆటగాళ్లలో నికోలస్‌(55), లాథమ్‌(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. విలియమ్సన్‌(30) ఫర్వాలేదనిపించాడు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి కివీస్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, ఫ్లంకెట్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement