లార్డ్స్: విశ్వవేదికపై ఇంగ్లండ్ విజయం సాధించింది అనకంటే న్యూజిలాండ్ దురదృష్టమే గెలిపించిందని చెప్పాలి. ఎందుకంటే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ తరహా ఫలితం వెలువడలేదు. న్యూజిలాండ్ దురదృష్టం కాకపోతే.. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండు టై కావడం ఏంటి.. గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం ఏంటి.. బౌల్ట్ క్యాచ్ పట్టుకోని బౌండరీ లైన్ తొక్కడం ఏంటి. ఇదంతా చూస్తే ఈసారి కప్ ఇంగ్లండ్‌కే రాసినట్టుంది.
ఆఖరి ఓవర్‌లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి సరిగ్గా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం.. అంపైర్లు 6 పరుగులు ఇవ్వడం ఇప్పుడు వివాదస్పదమైంది. స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ చేసిన ఘోర తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. ఐసీసీ నిబంధనల మేరకు ఆతిథ్య జట్టుకు లభించాల్సింది కేవలం 5 పరుగులే. 19.8 నిబంధన మేరకు ఓవర్‌త్రో ద్వారా బౌండరీ లభించినప్పుడు ఆ పరుగులతో పాటు ఫీల్డర్ యాక్షన్ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి.
అయితే ఇక్కడ బెన్‌స్టోక్స్, ఆదిల్ రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్ బ్యాట్ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. కానీ అంపైర్లు ఇది గుర్తించకుండా 6 పరుగులిచ్చి కివీస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. వాస్తవానికి ఈ పరుగులే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. 5 పరుగులు కనుక ఇచ్చి ఉంటే ఇంగ్లండ్ విజయానికి రెండు బంతుల్లో 4 పరుగలు చేయాల్సి వచ్చేది. న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలిచేంది.
ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అంపైర్లు ఘోర తప్పిదం చేశారని ఆస్ట్రేలియా మాజీ అంపైర్, ఐదు సార్లు ఐసీసీ బెస్ట్ అంపైర్‌గా నిచిన సైమన్ టఫెల్ అన్నారు. ‘ఇది అంపైర్ల తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులే. ఆ ఉత్కంఠ స్థితిల్లో బ్యాట్స్‌మెన్ పరుగును పూర్తిచేశారని అంపైర్లు భావించారు. కానీ రెండో పరుగు పూర్తి కాలేదు. టీవీ రిప్లేలో ఈ విషయం స్పష్టమైంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment