ఓ తండ్రిగా గర్వపడుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ ఓటమి తనను తీవ్రంగా నిరాశపరించిందని వరల్డ్‌కప్ మ్యాచ్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్‌స్టోక్స్ తండ్రి గెరార్డ్ వ్యాఖ్యానించాడు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ తొలిసారి కప్‌ను ముద్దాడటంలో ఆ జట్టు ఆల్ రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం తన కారణంగా జట్టు టీ 20 వరల్డ్‌కప్‌లో ట్రోఫీని చేజార్చుకుందన్న అపరాధ భావనను ఆదివారం నాటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా స్టోక్స్ చెరిపేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి సహచరులు వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోవడమే కాక సూపర్ ఓవర్లో సైతం సమయోచితంగా బ్యాటింగ్ చేసి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించిన లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచి చెరిగిపోని ఙ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో స్టోక్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. బెన్ స్టోక్స్‌ను ఆల్ టైమ్ గ్రేటస్ట్ క్రికెటర్‌గా పేర్కొంటూ ఐసీసీ తన క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్‌లో అతడిని ఆకాశానికి ఎత్తేసింది. ఈ క్రమంలో స్టోక్స్ తండ్రి గెరార్డ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఓ వైపు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూనే.. మరోవైపు కివీస్ ఓటమి తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశాడు. ‘ న్యూజిలాండ్‌లో అత్యధిక మంది చేత ద్వేషింపబడే తండ్రిని నేనేమో. బ్లాక్ క్యాప్స్ ఓటమి నన్నెంతో నిరాశకు గురిచేసింది. ట్రోఫీ లేకుండా వెనుదిరగడం నిజంగా సిగ్గుచేటు. గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా తన జట్టును గెలిపించిన స్టోక్స్ తండ్రిగా ఆనందంలో తేలియాడుతున్నా.ఏదేమైనా స్టోక్స్ కఠిన శ్రమకు ఈ మ్యాచ్‌తో ప్రతిఫలం లభించినట్లైంది. కానీ న్యూజిలాండ్ సపోర్టర్‌గా తీవ్ర నైరాశ్యంలో ఉన్నా’ అని వ్యాఖ్యానించాడు.
కాగా స్టోక్స్ న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడన్న సంగతి తెలిసిందే. అతడికి పన్నెండేళ్లు వచ్చేనాటికి స్టోక్స్ కుటుంబం నార్తర్న్ ఇంగ్లండ్‌కు షిఫ్ట్ అయ్యింది. రగ్బీ లీగ్ కోచింగ్ కాంట్రాక్ట్ నిమిత్తం అతడి తండ్రి గెరార్డ్ కుటుంబంతో సహా కంబ్రియాకు వచ్చి స్థిరపడ్డారు. ఇక అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన స్టోక్స్ ఆల్ రౌండర్‌గా ఎదిగాడు.
Comments
Please login to add a commentAdd a comment