లండన్: ప్రపంచ క్రికెట్‌లో డీఆర్‌ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)ని ప్రవేశపెట్టి ఇప్పటికే చాలా ఏళ్లే అయ్యింది. ఈ విధానంపై కొన్ని అభ్యంతరాలు నేటికీ ఉన్నప్పటికీ దీని వల్ల క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయనే చెప్పాలి. డీఆర్‌ఎస్‌లో హాక్ ఐ (బాల్ ట్రాకింట్ టెక్నాలజీ), హాట్ స్పాట్(బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా అనే కోణాన్ని పరిశీలించడం), స్నికో మీటర్(బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా గుర్తించడానికి వాడే టెక్నాలజీ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో అసలు క్రికెటర్ ఔటా, కాదా అనే విషయంపై థర్డ్ అంపైర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్ అంపైర్‌కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది.
వన్డే ఫార్మాట్‌లో ఒక జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్రమంలో ఒక రివ్యూనే ఉంటుంది. దాన్ని ఎక్కడ, ఎలా వాడుకోవాలనేది అక్కడ ఉండే పరిస్థితిపైనే ఉంటుంది. ఒకసారి రివ్యూకు కోల్పోతే మళ్లీ చాన్స్ ఉండదు. అదే సమయంలో రివ్యూకు సక్సెస్ అయితే అది అలానే ఉంటుంది. మరొకవైపు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది.
కాగా, ఆదివారంతో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో డీఆర్‌ఎస్‌ది కూడా ప్రముఖ పాత్రనే చెప్పాలి. నిజంగా డీఆర్‌ఎస్ లేకుంటే మెగా టోర్నీ కూడా పేలవంగా ముగిసే అవకాశంతో పాటు ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసేది. ఈ వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇలా అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్ అలన్ కెటల్‌బారో(ఇంగ్లండ్ అంపైర్) మొదటి స్థానంలో ఉన్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో రిచర్డ్ అలన్ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలగా, ఆ తర్వాత వరుసలో క్రిస్టోఫర్ గాఫనీ(న్యూజిలాండ్ అంపైర్), పాల్ విల్సన్(ఆస్ట్రేలియా అంపైర్), రుచిర పలియాగురుజే( శ్రీలంక అంపైర్), కుమార ధర్మసేన(శ్రీలంక అంపైర్)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో నాలుగు అంపైరింగ్ తప్పిదాలు చేశారు.
ఆసీస్‌తో సెమీస్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ఇలానే బలైపోయాడు. కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్ పెవిలియన్ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్ ఇక చేసేదేమీ లేకపోయింది. ఇదొక ఉదాహరణే అయినా, ఇంకా ఇటువంటివి చాలనే ఉన్నాయి. డీఆర్‌ఎస్ విధానం ఉండగానే ఇన్ని తప్పిదాలు జరిగితే.. అసలు అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి లేకుంటే మాత్రం అధిక సంఖ్యలో ఆటగాళ్లు కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు బలైపోయేవారనేది కాదనలేని సత్యం.
Comments
Please login to add a commentAdd a comment