
లండన్ : ప్రపంచకప్ ఫైనల్లో ఓడితే మళ్లీ క్రికెట్ ఆడకపోయేవాడినని, బ్యాట్ పట్టుకోవడానికి కూడా ధైర్యం చేయకపోయేవాడినని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ తెలిపాడు. మ్యాచ్‌కు ముందు ఓటమి భయం తనని వెంటాడిందని, ఓడితే మళ్లీ ఏ ముఖం పెట్టుకొని క్రికెట్ ఆడాలని తనలో తాను కుమిలిపోయానన్నాడు. ఈ పరిస్థితిని ఇంగ్లండ్ జట్టు సైకాలజిస్ట్ డేవిడ్ యంగ్‌కు వివరించి సమాధానాలు తెలుసుకున్నానని డైలీమెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఆ బాధ నాకు తెలుసు..
‘ప్రపంచకప్ ఫైనల్ ముందు మొత్తం 8 ఫైనల్ మ్యాచ్‌లు ఆడాను. ఇందులో 7 మ్యాచ్‌ల్లో ఓటమే ఎదురైంది. ఈ ఓడిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ తరఫున ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్-2016 ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇతర జట్టు టైటిల్ అందుకుంటుంటే చూస్తు ఉండటం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ వర్ణాతీతం. అలాంటిది మళ్లీ పునరావృతం కావద్దని, పశ్చాతాపానికి గురికావద్దని గట్టిగా అనునుకున్నా. ఆ దేవుడిని ప్రార్థించా.
భయమెందుకంటే..
ఓటమి భయం ఎందుకు వెంటాడిందంటే.. మళ్లీ క్రికెట్ ఎలా ఆడాలో నాకు తెలియదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్ ఫైనల్ ఆడే అవకాశం వస్తుంది. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఎంత అనుకున్నా.. ఆ క్షణం భయపడుతూనే ఉన్నా. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం తట్టుకోలేకపోయేవాడిని. చాలా రోజుల వరకు బ్యాట్ కూడా పట్టుకోకపోదును. అద్భుత ప్రదర్శన కనబరుస్తామని, జట్టును గెలిపించే సత్తా ఉందని మాకు తెలుసు. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితేనే ఎలా? అనే సందేహమే నన్ను తీవ్రంగా వేధించింది.’ అని బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఇక టోర్నీ మధ్యలో వరుస ఓటములు ఎదురైనప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందన్నాడు. హాట్ ఫేవరేట్‌కు దిగిన తమ జట్టు వరుస ఓటములతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొన్నప్పుడు కూడా భయమేసిందన్నాడు. బెయిర్‌స్టో గాయం కూడా కలవరపాటుకు గురిచేసిందని, గప్టిల్‌ను రనౌట్ చేయడం.. సూపర్ ఓవర్ టై కావడం.. తమ విజయం ఖాయామని తెలవడం.. మేం వేసిన గంతులు.. ఆస్వాదించిన ఆ క్షణాలు.. అద్భుతమని బట్లర్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment