
దుబాయ్: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా! న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య హోరాహోరీ పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇదీ ‘టై’ కాగా బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతను చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగు వేసింది. తాజాగా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ ‘టై’ అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని నిర్ణయించింది.
కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. కానీ... ఆ సూపర్ ‘టై’ అయితే మ్యాచ్‌ను ‘టై’గా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. జింబాబ్వే, నేపాల్ జట్లపై విధించిన నిషేధాన్ని కూడా ఐసీసీ ఎత్తేసింది. మహిళల మెగా ఈవెంట్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. టి20 ప్రపంచకప్ విజేతకు 10 లక్షల డాలర్లు (రూ.7 కోట్లు), రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3.5 కోట్లు) ఇస్తారు. వన్డే ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీని 3.5 మిలియన్ డాలర్లు (రూ.24.8 కోట్లకు) పెంచింది. 2021 నుంచి అండర్–19 మహిళల టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment