యువరాజ్ తల్లిపై ఆరోపణలకు సమాధానాలివే..
గురుగ్రామ్కు చెందిన అకాంక్ష శర్మ అనే యువతి ఓ టీవీ రియల్టీ షోలో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని షబ్నం తరఫు న్యాయవాది దమన్వీర్ సింగ్ సోబ్టీ స్పష్టం చేశారు. ఆకాంక్ష చేసిన ఆరోపణలు తప్పని షబ్నం న్యాయవాది ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు. యువరాజ్ సోదరుడు జోరావర్ను వివాహం చేసుకున్న ఆకాంక్ష, తమ పెళ్లి విచ్ఛిన్నం కావడానికి షబ్నం కారణమంటూ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
భర్తతో విడిపోయాక అతని కుటుంబం వారు తనకు నెలకు 3 వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, తాను చాలా ఇబ్బంది పడ్డానన్న ఆకాంక్ష ఆరోపణకు న్యాయవాది సమాధానమిస్తూ.. 2014 సెప్టెంబర్లో ఆకాంక్ష ఇంటి నుంచి వెళ్లిపోయాక షబ్నం ప్రతినెలా ఆమెకు 20 వేల రూపాయలు పంపేవారని, 2015 ఏప్రిల్ వరకు ఇలా డబ్బు పంపారని, అయితే అదనంగా డబ్బులు ఇవ్వాలని ఆకాంక్ష బెదిరించడంతో జొరావర్ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేశాడని చెప్పారు. ఇది చండీగఢ్ కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు.
ఇక తాము హనీమూన్కు వెళ్లినపుడు షబ్నం తమ వెంట వచ్చారని, ఆమె తమ గదిలో పడుకుందని ఆకాంక్ష చేసిన ఆరోపణలకు బదులిస్తూ.. పెళ్లయ్యాక ఆకాంక్ష అనారోగ్యంతో ఉందని, ఈ విషయం ఆమె తల్లి మోనికకు చెప్పడంతో తన కుమార్తెకు సమస్య ఉందని అంగీకరించిందని, ఆకాంక్ష ఒంటరిగా వెళ్లరాదన్న మోనిక అభ్యర్థన మేరకు షబ్నం అన్ని ఖర్చులు భరించి, ఆ జంట వెంట గోవాకు షబ్నం, మోనిక వెళ్లారని దమన్వీర్ సింగ్ చెప్పారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన బిల్లులు, ఫ్లయిట్ టికెట్లు, హోటల్ బిల్లులు అన్నీ ఆయన మీడియాకు చూపించారు.