
వైభవంగా మెస్సీ వివాహ వేడుక
రొజారియో (అర్జెంటీనా): అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ వివాహ వేడుక శనివారం కెసినో కాంప్లెక్స్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అర్జెంటీనా మీడియా ‘శతాబ్దపు పెళ్లి’గా అభివర్ణించిన ఈ వేడుకలో పలువురు సాకర్ స్టార్లతో పాటు పాప్ సింగర్లు హాజరయ్యారు. బాల్య స్నేహితురాలైన 29 ఏళ్ల అంటోనెల్లా రొకుజోను వారి సంప్రదాయం ప్రకారం మెస్సీ (30) పెళ్లి చేసుకున్నాడు. నిజానికి పెళ్లికి ముందే వీరిద్దరు ఓ ఇంటివారయ్యారు.
సుదీర్ఘ సహజీవనంలో వీరికి ఇద్దరు కుమారులు థియాగో మెస్సీ, మాటే మెస్సీ ఉన్నారు. వివాహ వేడుకకు 260 మంది అతిథులొచ్చారు. మెస్సీ తల్లిదండ్రులు సెలియా, జార్జ్ మెస్సీ, సోదరి మరియాలతో పాటు బార్సిలోనా క్లబ్ సహచరులు నెయ్‌మార్, స్వారెజ్, అర్జెంటీనా స్ట్రయికర్ సెర్గియో అగ్వెరో, చెల్సి స్టార్ ఫాబ్రెగాస్ తదితర ఆటగాళ్లంతా వారి గర్ల్ ఫ్రెండ్స్‌తో విచ్చేశారు. పాప్ సింగర్ షకీరా తన భర్త గెరార్డ్ పికెతో కలిసి హాజరైంది.