
కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతున్న యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 589 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఆయుష్ బదోని (205 బంతుల్లో 185 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయాడు. సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో 15 పరుగుల దూరంలో నిలిచాడు. మరో వైపు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్జున్ టెండూల్కర్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
11 బంతులాడి దుల్షాన్ బౌలింగ్‌లో సూర్యబండారకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 1989లో పాకిస్తాన్‌తో గుజ్రన్‌వాలాలో ఆడిన తన తొలి వన్డేలో సచిన్ టెండూల్కర్ సున్నాకే ఔటైన ఘటనను ఇది గుర్తుకు తెచ్చింది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆట నిలిచే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఫెర్నాండో (118 బంతుల్లో 104; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. చేతిలో ఏడు వికెట్లున్న లంక ఇంకా 168 పరుగులు వెనుకబడి ఉంది.