భారత అభిమానుల్లా ప్రవర్తించకండి: రణతుంగ
సాక్షి, పల్లెకెలె: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత అభిమానుల్లా ప్రవర్తించవద్దని శ్రీలంక అభిమానులకు సూచించాడు. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయాన్ని తట్టుకోలేని లంక అభిమానులు మైదానంలోని ఫీల్డర్లపై బాటిళ్లు విసిరారు. దీంతోమ్యాచ్ 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై స్పందించిన రణతుంగ ‘భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లంక అభిమానులు కాస్త ఓర్పుతో ఉండాలి. సంయమనం పాటించాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయవద్దు. లంక ప్రజలు క్రికెట్‌ని ప్రేమిస్తారు. మేము మ్యాచ్ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు. క్రికెట్ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతి ఒప్పుకోదు’ అని రణతుంగ అన్నాడు.
1996లో ప్రపంచకప్ సెమీస్‌లో ఈడెన్‌గార్డెన్‌లో భారత్-లంక జట్లు తలపడ్డాయి. భారత్ వరుస వికెట్లు కోల్పోవడంతో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి గొడవ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రణతంగ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. ఇక గతంలో 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని వివాదస్పద వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.