సాక్షి, ఇండోర్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా ఉంది ఆస్ట్రేలియా పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సీరీస్ కోల్పోయిన స్మిత్ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన ఇండోర్ వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న తరుణంలో స్మిత సేనకు ఊహించని షాక్ తగిలింది.
స్పిన్నర్ ఆస్టన్ అగర్ చిటికెను వేలి గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరం అయ్యాడు. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో అగర్ బౌండరీని అడ్డుకునే క్రమంలో అతని కుడి చేతి చిటికెను వేలుకు గాయమైంది. మ్యాచ్ అనంతరం ఎక్స్‌రేలో వేలు విరిగినట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలనే జట్టు డాక్టర్ సా సూచనల మేరకు అగర్ తిరుగు పయనమయ్యాడు. ఇప్పటికే స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై సతమతమవుతున్న ఆసీస్ బౌలింగ్ విభాగానికి తాజా ఘటనతో మరింత ఆందోళన నెలకొంది.