ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయం కారణంగా ప్రపంచకప్ తొలి భాగానికి దూరమవుతాడనుకున్న ట్రవిస్ హెడ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వస్తాడనుకున్న మార్నస్ లబూషేన్ ఇతర ఆటగాడి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆసీస్ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ కాలి కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది.
తొలుత అగర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మాథ్యూ షార్ట్ లేదా తన్వీర్ సంగాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమిండియాతో ఆఖరి వన్డేలో మ్యాక్స్‌వెల్ బంతితో రాణించడంతో (4 వికెట్లు) స్పిన్నర్‌కు బదులు ప్రొఫెషనల్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ప్రకటించకపోగా.. లబూషేన్‌ను అగర్ స్థానంలో జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది.
అగర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులోకి వస్తామని కలలు కన్న మాథ్యూ షార్ట్, తన్వీర్ సంగాకు ఈ ఊహించని పరిణామంతో నిరాశే ఎదురైంది. మ్యాక్స్‌వెల్ స్పిన్నర్‌గా రాణించి ఈ ఇద్దరి ఆశలను అడియాసలు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ స్థానాన్ని మ్యాక్సీ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకంగా ఉంది. పై పేర్కొన్న మార్పులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది.
వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్
Comments
Please login to add a commentAdd a comment