Aus Vs WI 2nd Test: Labuschagne Head Centuries Australia Score 511D - Sakshi
Sakshi News home page

WTC 2021-23: విండీస్‌తో మ్యాచ్‌.. ఆస్ట్రేలియా భారీ స్కోరు! ఫైనల్‌ చేరే క్రమంలో..

Published Fri, Dec 9 2022 7:06 PM | Last Updated on Fri, Dec 9 2022 9:12 PM

Aus Vs WI 2nd Test: Labuschagne Head Centuries Australia Score 511d - Sakshi

లబుషేన్‌, హెడ్‌ (PC: CA Twitter)

Australia vs West Indies, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 409 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. తొలి టెస్టులో విండీస్‌ను 164 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన కంగారూ బృందం.. రెండో టెస్టులోనూ అదరగొడుతోంది.

అద్భుత సెంచరీలు
అడిలైడ్‌ వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య ఆరంభమైన రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 21 పరుగులకే పరిమితం కాగా.. మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా అర్ధ శతకం(63) సాధించాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 305 బంతులు ఎదుర్కొని 163 పరుగులు(14 ఫోర్లు) చేశాడు. తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. 

ఆకాశమే హద్దు
అయితే, నాలుగో స్థానంలో వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది. 219 బంతుల్లో హెడ్‌.. 20 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో అలెక్స్‌ క్యారీ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారీ ఆధిక్యంలో
ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా 137 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 511 పరుగులు స్కోరు చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ 102 పరుగులు చేయగలిగింది.

ఫైనల్‌ చేరే క్రమంలో మున్ముందుకు
టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ 47, ఆండర్సన్‌ ఫిలిప్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. విండీస్‌ 409 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్‌ బౌలర్లలో మైకేల్‌ నసర్‌కు రెండు, నాథన్‌ లియాన్‌కు ఒకటి, కామెరూన్‌ గ్రీన్‌కు ఒక వికెట్‌ లభించాయి. ఇక వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆసీస్‌ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలుగుతుంది. విండీస్‌ ఓడితే.. డబ్ల్యూటీసీ అవకాశాలు దాదాపు గల్లంతైనట్లే!

చదవండి: Abrar Ahmed: ఇదేం బౌలింగ్‌రా బాబూ! మొదటి 7 వికెట్లు.. ఆ గూగ్లీ స్పెషల్‌.. స్టోక్స్‌ మతిపోయింది!
ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement