CWC 2023: ఆసీస్‌ ఓపెనర్లు ఊచకోత.. 2 బంతుల్లో ఊహకందని విధ్వంసం | CWC 2023 AUS VS NZ: Australia Smashes 21 Runs Of 2 Legal Deliveries Vs New Zealand | Sakshi
Sakshi News home page

CWC 2023 AUS VS NZ: ఆసీస్‌ ఓపెనర్లు ఊచకోత.. 2 బంతుల్లో ఊహకందని విధ్వంసం

Published Sat, Oct 28 2023 2:53 PM | Last Updated on Sat, Oct 28 2023 3:06 PM

CWC 2023 AUS VS NZ: Australia Smashes 21 Runs Of 2 Legal Deliveries Vs New Zealand - Sakshi

న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్‌ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

ఓ దశలో ఆసీస్‌ జోరు చూసి ఈ మ్యాచ్‌లో 500 పరుగుల స్కోర్‌ దాటడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆఖర్లో కివీస్‌ బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్‌ 400 లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ ఆఖరి 4 వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడం విశేషం. 49 ఓవర్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి మ్యాట్‌ హెన్రీ.. స్టార్క్‌ వికెట్‌ తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమాప్తమైంది. కివీస్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (10-0-37-3) నమోదు చేయగా.. బౌల్ట్‌ 3, సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు. కివీస్‌ బౌలర్లలో ఫిలిప్స్‌ తప్పించి మిగతావారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

రెండు బంతుల్లో 21 పరుగులు..
ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఓ అరుదైన ఫీట్‌ నమోదైంది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో ఆసీస్‌ ఓపెనర్లు వార్నర్‌, హెడ్‌లు 2 బంతుల్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నారు. ఓవర్‌ తొలి బంతిని వార్నర్‌ సిక్సర్‌గా మలచగా.. రెండో బంతిని అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. ఈ బంతికి వార్నర్‌ సింగిల్‌ తీశాడు. దీంతో స్ట్రయిక్‌లోకి వచ్చిన హెడ్‌కు ఫ్రీ హిట్‌ లభించింది. ఈ బంతిని కూడా హెన్రీ క్రీజ్‌ దాటి బౌలింగ్‌ చేయడంతో అంపైర్‌ మరోసారి నో బాల్‌గా ప్రకటించాడు. ఈ బంతిని హెడ్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో రెండో బంతి పడకుండానే ఆసీస్‌ 15 పరుగులు పిండుకుంది. ఎట్టకేలకు హెన్రీ రెండో బంతిని సరిగ్గా బౌల్‌ చేసినప్పటికీ.. ఆ బంతిని కూడా హెడ్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఆసీస్‌ 2 బంతుల్లో 21 పరుగులు సాధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement