
గత రెండేళ్లలోనే అతనిలో మార్పు: సచిన్
భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ పై మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ముంబై: భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ పై మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ సత్తా చాటుతూ అశ్విన్ కీలక ఆటగాడిగా పరిణితి చెందాడన్నాడు. అశ్విన్ తరహా ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు బలం పెరిగిందన్నాడు.అశ్విన్ ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన నాలుగు టెస్టు సెంచరీలు చేయడాన్ని సచిన్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇది మన బ్యాటింగ్ బలాన్ని చూపెడుతుందన్నాడు.
'గడిచిన రెండేళ్లలో అశ్విన్లో బాగా మార్పు వచ్చింది. అతని బౌలింగ్ ను మార్చుకుంటూ కీలక బౌలర్గా ఎదిగాడు. అదే క్రమంలో అతని బ్యాటింగ్ను కూడా మార్చుకున్నాడు. అశ్విన్తో ఎక్కువగా ప్రయోగాలు చేయడమే అతనిలో మార్పుకు కారణమని నేను అనుకుంటున్నా'అని సచిన్ తెలిపాడు. భారత్ లోనే కాదు.. విదేశాల్లో కూడా అశ్విన్ రాణించే రోజులు త్వరలోనే వస్తాయని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఎంతో పరిణితి చెందిన అశ్విన్.. విదేశాల్లో కూడా తిరుగులేని స్పిన్నర్గా గుర్తింపు పొందుతాడన్నాడు.
మనం దూకుడైన క్రికెట్ను, అటాకింగ్ క్రికెట్ను ఆడుతూ విజయాలను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఇక్కడ జట్టు సమష్టిగా జట్టు విజయాలు సాధించడం అభినందించదగ్గ విషయమన్నాడు. దాంతో పాటు జట్టుకు నిలకడైన ఒక సారథిగా విరాట్ కోహ్లి తగిన న్యాయం చేస్తున్నాడని కొనియాడాడు.