ఈసారి రిక్త హస్తాలతో... | Asia Badminton Championships: Saina Nehwal, PV Sindhu, Sameer Verma blown away | Sakshi
Sakshi News home page

ఈసారి రిక్త హస్తాలతో...

Published Sat, Apr 27 2019 12:48 AM | Last Updated on Sat, Apr 27 2019 12:48 AM

Asia Badminton Championships: Saina Nehwal, PV Sindhu, Sameer Verma blown away - Sakshi

వుహాన్‌ (చైనా): పతకాలకు విజయం దూరంలో ఉన్నప్పటికీ... అందరి అంచనాలను వమ్ము చేస్తూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్, సమీర్‌ వర్మ ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ) నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ సింధు, ఏడో సీడ్‌ సైనా... పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ పరాజయం పాలయ్యారు. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనా 13–21, 23–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్‌గా యామగుచి చేతిలో సైనాకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. గతంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన సైనా... 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 11–6తో, 14–11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది.

సైనా 14–11తో ముందంజలో ఉన్నపుడు యామగుచి ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 17–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సైనా కేవలం రెండు పాయింట్లు గెలిచి, నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకుంది. ప్రపంచ 17వ ర్యాంకర్‌ కాయ్‌ యాన్‌యాన్‌ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు 19–21, 9–21తో ఓడింది. 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మెరుగ్గా ఆడిన సింధు రెండో గేమ్‌లో మాత్రం తేలిపోయింది. ఈ గెలుపుతో ఈ నెలారంభంలో సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు చేతిలో ఎదురైన ఓటమికి కాయ్‌ యాన్‌యాన్‌ బదులు తీర్చుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 10–21, 12–21తో పరాజయం పాలయ్యాడు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభంలో మినహా సమీర్‌ తన ప్రత్యర్థి ముందు ఎదురు నిలువలేకపోయాడు. 

క్వార్టర్స్‌లో పరాజయం నిరాశ పరిచింది. మూడో గేమ్‌ మొదలయ్యేసరికి నేను అలసిపోయాను. ఈ గేమ్‌లో రెండుసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ పరిస్థితిని 
అనుకూలంగా మల్చుకోలేకపోయాను. 
– సైనా నెహ్వాల్‌ 

ఇటీవల కోచ్‌ల మార్పు ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసింది. మన ఆటగాళ్లలో అపార ప్రతిభ ఉంది. వారందరూ తప్పకుండా పుంజుకుంటారు. గొప్ప విజయాలతో పునరాగమనం చేస్తారని 
గట్టి నమ్మకంతో ఉన్నాను. 
– మొహమ్మద్‌ సియాదత్, భారత కోచ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement