
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. చైనీస్‌తైపీలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆదివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్లు దివ్యాన్‡్ష సింగ్ పాన్వర్, ఎలవెనీల్ వలరియవన్ పసిడి పతకాల్ని క్లీన్‌స్వీప్ చేశారు. పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో దివ్యాన్‡్ష, మహిళల ఈవెంట్‌లో ఎలవెనీల్ చెరో స్వర్ణం గెలిచారు. వీళ్లిద్దరు సహచరులతో కలిసి బరిలోకి దిగిన టీమ్ ఈవెంట్‌లోనూ బంగారు పతకాలు నెగ్గారు.
10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో దివ్యాన్‡్ష, రవికుమార్, దీపక్ కుమార్‌ల బృందం విజేతగా నిలిచింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో ఎలవెనీల్, అపూర్వీ, మేఘనలతో కూడిన భారత జట్టు బంగారు పతకం సాధించింది. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య డజనుకు చేరింది. 14 పసిడి పతకాలకు గాను 12 స్వర్ణాలను భారత షూటర్లే చేజిక్కించుకోవడం విశేషం. వీటితో పాటు భారత్ ఖాతాలో నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు కూడా ఉన్నాయి. నేడు జరిగే జూనియర్ ఈవెంట్ పోటీలతో ఈ టోర్నీ ముగియనుంది.