బాక్సింగ్‌లో కుర్రాడు అమిత్ అదరగొట్టగా... బ్రిడ్జ్‌లో పెద్దోళ్లు ప్రణబ్ బర్దన్, శివ్‌నాథ్ సర్కార్ చేయి తిరగడంతో జకార్తా ఏషియాడ్‌ను భారత్ తమ అత్యధిక పతకాల రికార్డుతో ముగించింది. స్క్వాష్‌లో భారత మహిళల జట్టు రజతం... పురుషుల హాకీలో కాంస్యం సాధించడం ఊరటనిచ్చాయి. శనివారంతో మన ఆటగాళ్లు పాల్గొనే ఈవెంట్లు పూర్తికాగా... మొత్తం 15 స్వర్ణాలు ఖాతాలో చేరాయి. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి (1951) ఆసియా క్రీడల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ 15 పసిడి పతకాలు సాధించడం విశేషం. దీంతోపాటు 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి అభిమానులకు అమితానందం కలిగించింది. నేడు జరిగే ముగింపు వేడుకలతో జకార్తా ఏషియాడ్‌కు తెర పడనుంది.
జకార్తా: బరిలో దిగబోతున్నది ఫైనల్ బౌట్... ప్రత్యర్థి రియో ఒలింపిక్స్ చాంపియన్, ఆసియా విజేత... ఇటు చూస్తే 22 ఏళ్ల కుర్రాడు... ఇటీవలే అతడి చేతిలో ఓటమి పాలయ్యాడు! పైగా తొలిసారిగా ఏషియాడ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు! ఈ సమీకరణాలన్నీ చూస్తే ఆ యువకుడు చిత్తుగా ఓడిపోయి ఉండాలి.! కానీ, అంతా తారుమారైంది. అద్భుతం జరిగింది. స్వర్ణం భారత్ సొంతమైంది. దీనంతటినీ సాధించింది హరియాణా బాక్సర్ అమిత్ పంఘాల్. 49 కేజీల విభాగంలో శనివారం జరిగిన తుది పోరులో అతడు 3–2 తేడాతో హసన్‌బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను మట్టికరిపించి రింగ్‌లో ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి బంగారు పతకం అందించాడు.
తేలిపోతాడనుకుంటే...
ఫైనల్లో చురుకైన వ్యూహం, వేగం, చక్కటి డిఫెన్స్, దూకుడుతో పాటు ఎలాంటి తప్పులు చేయకుండా అమిత్... దుస్మతోవ్ ఆట కట్టించాడు. ఓవైపు ప్రత్యర్థికి చిక్కకుండా చూసుకుంటూనే బలమైన పంచ్‌లు విసిరాడు. సహజంగా ఎదురు దాడితో దెబ్బతీసే దుస్మతోవ్... అమిత్ జోరుముందు ఆ పనీ చేయలేకపోయాడు. చివరకు వచ్చేసరికి పూర్తిగా అలసిపోయాడు. దీంతో అమిత్‌ను విజయం వరించింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దుస్మతోవ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకున్నా. కోచ్‌లు నన్ను బాగా సిద్ధం చేశారు. ఇంగ్లండ్‌లో శిక్షణ, భారత్‌లో సన్నాహక శిబిరంలో పాల్గొనడం ఉపయోగపడింది’ అని అమిత్ అన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అమిత్... కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచాడు. ఈ ఏషియాడ్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు (అమిత్ స్వర్ణం, వికాస్ కాంస్యం) లభించాయి.
పురుషుల హాకీ జట్టుకు కాంస్యం
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగి... గోల్స్ వర్షంతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి... సెమీస్‌లో మలేసియాపై చతికిలపడిన భారత పురుషుల హాకీ జట్టు... వర్గీకరణ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై చక్కటి విజయంతో ఏషియాడ్‌లో కాంస్యం నెగ్గి పరువు దక్కించుకుంది. ఆట ఆరంభంలో ఆకాశ్‌దీప్ సింగ్ (3వ ని.లో)... ముగింపులో హర్మన్‌ప్రీత్ సింగ్ (50వ ని.లో) మెరవడంతో శనివారం ఇక్కడ జరిగిన పోటీలో శ్రీజేష్ సేన 2–1తో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. పాక్ తరఫున అతీఖ్ (52వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరోవైపు ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈసారి చేజారనీయలేదు...
సెమీస్‌లో ఆఖరి నిమిషంలో ఆధిక్యం చేజార్చుకుని సడెన్ డెత్ వరకు వెళ్లి ఓటమి మూటగట్టుకున్న భారత్... పాక్‌పై మాత్రం పట్టు జారనీయలేదు. ప్రారంభంలోనే రెండు అవకాశాలు సృష్టించుకుంది. 3వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ ఇచ్చిన పాస్‌ను ఆకాశ్‌దీప్... ప్రత్యర్థి కీపర్ ఇమ్రాన్ బట్‌ను తప్పిస్తూ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీనికి స్పందనగా ఐదో నిమిషంలోనే పాక్ గోల్ చేసినంత పనిచేసింది. అయితే, సమీక్షలో అతీఖ్ కొట్టిన షాట్ గోల్ లైన్‌ను దాటలేదని తేలింది. టీమిండియా ఆధిపత్యంతోనే మొదటి క్వార్టర్ ముగిసింది. రెండో క్వార్టర్‌లో వరుస దాడులతో పాక్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. 39వ నిమిషంలో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇర్ఫాన్ గోల్ చేయలేకపోయాడు. చివరిదైన నాలుగో క్వార్టర్‌లో భారత్ ప్రత్యర్థి శిబిరంలోకి పదేపదే చొచ్చుకెళ్లింది. 50వ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ తడబాటు లేకుండా నెట్‌లోకి పంపాడు. మరో రెండు నిమిషాలకే అబుబకర్ నుంచి పాస్ అందుకున్న అతీఖ్ పాక్ ఖాతా తెరిచాడు. ఈ పరిస్థితుల్లో చివర్లో గోల్స్ సమర్పించుకునే బలహీనతను అధిగమిస్తూ శ్రీజేష్ సేన... పట్టుదలతో ఆడి పాక్‌ను నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
స్క్వాష్‌లో రజతమే
మహిళల టీమ్ స్క్వాష్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై సంచలన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్లో హాంకాంగ్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకంది. జోష్నా చినప్ప, దీపిక పల్లికల్, సునయన కురువిల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత మహిళల జట్టు తుది సమరంలో 0–2తో హాంకాంగ్ చేతిలో ఓడింది. మొదటి మ్యాచ్‌లో సునయన 8–11, 6–11, 12–10, 3–11తో జె లక్ హో చేతిలో .... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 3–11, 9–11, 5–11తో వింగ్ చీ అన్నీ చేతిలో ఓడిపోయారు. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్ నిర్వహించలేదు.
Comments
Please login to add a commentAdd a comment