సింధు
అలోర్ సెటార్ (మలేసియా): స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్ ప్రణయ్ గైర్హాజరీ నేపథ్యంలో... ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల, పురుషుల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్ చేరుకున్న జట్లు మేలో జరిగే థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తాయి. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం ఆసియా పోటీల నుంచి సైనా వైదొలగగా... గాయం కారణంగా ప్రణయ్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. తొలి రోజు ఫిలిప్పీన్స్‌తో భారత పురుషుల జట్టు... హాంకాంగ్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. భారత పురుషుల జట్టుకు సులువైన ‘డ్రా’ పడింది.
గ్రూప్ ‘డి’లో భారత్‌తోపాటు ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులు ఉన్నాయి. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ పోటీపడతారు. రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు బరిలోకి దిగుతాయి. భారత మహిళల జట్టు ముందంజ వేయాలంటే తొలి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ ‘డబ్ల్యూ’లో భారత్‌తోపాటు జపాన్, హాంకాంగ్ జట్లున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. సైనా గైర్హాజరీ నేపథ్యంలో... సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, రుత్విక శివాని, శ్రీకృష్ణప్రియ ఆడనున్నారు. డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ప్రజక్తా సావంత్–సంయోగిత జోడీలు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment