‘పసిడి’ అర్జున్ ఆసియా యూత్ చెస్
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ మెరిశాడు. ర్యాపిడ్ ఫార్మాట్‌లో అండర్–14 ఓపెన్ విభాగంలో అర్జున్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్ణీత ఏడు రౌండ్‌లలో అర్జున్ వరుసగా ఆరు గేముల్లో గెలిచి, చివరి గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. దిల్‌మురాద్ (ఉజ్బెకిస్తాన్), దంబాసురెన్ (మంగోలియా), తిలకరత్నె (శ్రీలంక), మెక్రిద్దీన్ (ఉజ్బెకిస్తాన్), ఎన్గో డుక్ త్రి (వియత్నాం), దగ్లీ అరష్ (ఇరాన్)లపై గెలుపొందిన అర్జున్... కసిమోవ్ అలీ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు.
ర్యాపిడ్ విభాగంలో భారత్‌కు ఓవరాల్‌గా రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి. అండర్–8 ఓపెన్ విభాగంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఇలంపర్తి స్వర్ణాన్ని సాధించగా... అండర్–10, అండర్–12 బాలికల విభాగంలో సవితాశ్రీ (తమిళనాడు), దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) రజత పతకాలు నెగ్గారు. అండర్–12 బాలికల విభాగంలో రక్షిత రవి (తమిళనాడు) కాంస్య పతకాన్ని సాధించింది. 17 దేశాల నుంచి 381 మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఈ టోర్నీలో స్టాండర్డ్, బ్లిట్జ్ విభాగాల్లో గేమ్‌లు జరగాల్సి ఉంది.