కోల్‌కతాను నిలువరించిన ఢిల్లీ
ఐఎస్‌ఎల్‌లో నేడు విశ్రాంతి దినం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఫేవరెట్‌గా పరిగణిస్తున్న అట్లెటికో డి కోల్‌కతా జట్టును ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు నిలువరించింది. పటిష్టమైన ఫార్వర్డ్ లైన్, డిఫెన్సివ్ విభాగంతో ఉన్న కోల్‌కతాను తమ శక్తిమేరా అడ్డుకోవడంలో సఫలమైన ఢిల్లీ జట్టు మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోగలిగింది. ఆదివారం సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నుంచి జోఫ్రే గోంజలెజ్ (49వ నిమిషంలో), ఢిల్లీ తరఫున పావెల్ ఎలియాస్ (73వ నిమిషంలో) గోల్స్ చేశారు. ఆరంభం నుంచే ఇరు జట్ల ఆటగాళ్లు అటాకింగ్ గేమ్‌కు ప్రాధాన్యమిచ్చారు.
20వ నిమిషంలో కోల్‌కతాకు గోల్ చేసే అవకాశం వచ్చినా ఫిక్రూ విఫలమయ్యాడు. ద్వితీయార్ధం 49వ నిమిషంలో గోల్ పోస్టుకు ఎదురుగా ఫిక్రూ జెర్సీని పట్టుకుని ఆపినందుకు రేమేకర్స్ (ఢిల్లీ) ఎల్లో కార్డ్‌కు గురికావడంతో పాటు కోల్‌కతాకు పెనాల్టీ అవకాశం దక్కింది. దీన్ని మిడ్ ఫీల్డర్ జోఫ్రే సులువుగా గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. దాదాపుగా మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న కోల్‌కతాకు 73వ నిమిషంలో ఎలియాస్ షాకిచ్చాడు. డెల్ పియరో నుంచి అందుకున్న బంతిని అవుట్‌సైడ్ బాక్స్ నుంచి నేరుగా స్క్రీమర్ షాట్‌తో అదరగొట్టి లీగ్‌లో ఢిల్లీకి తొలి గోల్‌ను అందించాడు. 88వ నిమిషంలో కోల్‌కతా ఆటగాడు రాకేశ్ మసీ రెండో ఎల్లో కార్డ్ అందుకోవడంతో ఆ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఆతర్వాత అదనపు గోల్సేమీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
గోవాతో నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా
నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య ఆదివారం జరిగిన మరో మ్యాచ్ కూడా 1-1తో డ్రా అయ్యింది. గువాహటిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 17వ నిమిషంలోనే గోవా జట్టు గ్రెగరీ చేసిన గోల్‌తో ఖాతా తెరిచింది. 34వ నిమిషంలో ఇన్‌సైడ్ బాక్స్‌లో గోవా ఆటగాడు దేబబ్రత.. నార్త్‌ఈస్ట్‌కు చెందిన రాబిన్‌ను వెనకవైపు నుంచి నెట్టివేయడంతో రిఫరీ పెనాల్టీ ఇచ్చారు. 37వ నిమిషంలో కోకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టోర్నీలో రెండో గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేశాడు.