
అట్లెటికో డి కోల్‌కతా శుభారంభం
ముంబై సిటీ ఎఫ్‌సీపై 3-0తో విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తొలి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా సత్తా చూపింది. ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే స్థానిక ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన ఈ జట్టు ఆదివారం వివేకానంద యువభారతి క్రిరంగన్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ముంబై సిటీ ఎఫ్‌సీని చిత్తు చేసింది. మ్యాచ్ కోసం స్టేడియంలో తొలిసారిగా 17 భారీ స్క్రీన్లను అమర్చారు. స్పెయిన్‌లో శిక్షణ పొందిన కోల్‌కత ఆటగాళ్లు ఆరంభం నుంచే ముంబైపై దాడులకు దిగారు.
వీరి దూకుడును అరికట్టడంలో రణబీర్ కపూర్ జట్టు ఘోరంగా విఫలమైంది. 27వ నిమిషంలో ఇథియోపియా స్ట్రయికర్ ఫిక్రూ టెఫెరా కోల్‌కతాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఫిక్రూ షాట్‌ను అడ్డుకునేందుకు ముంబై గోల్‌కీపర్ సుబ్రతా పాల్ పోస్టును వదిలి ముందుకువచ్చినా ఫలితం లేకపోయింది. ద్వితీయార్ధం 69వ నిమిషంలో బోర్జా ఫెర్నాండెజ్ (స్పెయిన్) చేసిన సూపర్ గోల్‌తో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ఎక్స్‌ట్రా సమయం (90+3)లో ఫిక్రూ ఇచ్చిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ ఆర్నల్ లిబర్ట్ గోల్ చేయడంతో జట్టు 3-0తో తిరుగులేని ఆధిక్యంతో నెగ్గింది.