
సిడ్నీ: ఆస్ట్రేలియా విఖ్యాత క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వారసుడు క్రికెట్‌లోకి వచ్చాడు. ఈ దిగ్గజ కెప్టెన్ కుమారుడైన ఆస్టిన్ వా శుక్రవారం ప్రకటించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల ఆస్టిన్ వా దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండేళ్లుగా అతను అండర్–17 స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అతను జాతీయ అండర్–17 టోర్నీలో న్యూ సౌత్‌వేల్స్ తరఫున అత్యధిక పరుగులు (372 పరుగులు) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
జూనియర్ ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టును ఎంపిక చేశారు. వచ్చే నెల న్యూజిలాండ్‌లో అండర్–19 ప్రపంచకప్ జరగనుంది. భారత సంతతికి చెందిన ఓపెనర్ 18 ఏళ్ల జాసన్ సంగ సారథ్యం వహించే ఈ జట్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కుమారుడు విల్ సదర్లాండ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ జట్టుకు మాజీ పేసర్ రియాన్ హారిస్ కోచ్. ఈ జూనియర్ మెగా ఈవెంట్‌లో గ్రూప్ ‘బి’లో ఉన్న ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో భారత్ (జనవరి 14న)తో తలపడుతుంది.
జట్టు: జాసన్ సంగ (కెప్టెన్), విల్ సదర్లాండ్ (వైస్ కెప్టెన్), జేవియర్, బ్రియాంట్, ఎడ్వర్డ్స్, ఇవాన్స్, ఫ్రీమాన్, హ్యాడ్లీ, బాక్స్‌టెర్, నాథన్, జొనాథన్ మెర్లో, రాల్‌స్టన్, ఉప్పల్, ఆస్టిన్ వా, లాయిడ్ పోప్.
Comments
Please login to add a commentAdd a comment