అమ్మాయిలు అదుర్స్
ఆస్ట్రేలియాపై 5-0తో గెలుపు ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ
కున్‌షాన్ (చైనా): మరోసారి పతకంపై దృష్టి పెట్టిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గద్దె రుత్విక శివాని గెలుపొందగా... రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప; సిక్కి రెడ్డి-సింధు జోడీలు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో సైనా 22-20, 21-14తో సువాన్ వెండీ చెన్‌పై... రెండో మ్యాచ్‌లో సింధు 21-12, 21-11తో జాయ్ లాయ్‌పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 21-9, 21-15తో సువాన్ వెండీ చెన్-గ్రోన్యా సోమెర్‌విల్లె జంటను ఓడించడంతో భారత్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
నాలుగో మ్యాచ్‌లో రుత్విక శివాని 21-5, 21-11తో టిఫానీ హోను ఓడించగా... ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-12, 21-12తో లెనీ చూ-జాయ్ లాయ్ జంటపై గెలుపొందడంతో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టు హాంకాంగ్‌తో ఆడుతుంది.