ఒకే రోజు 12 వికెట్లు..
బ్రిస్బేన్:ఆస్ట్రేలియా 'ఎ'- భారత 'ఎ' జట్ల మధ్య జరుగుతున్న అనధికార టెస్ట మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఆరు వికెట్లు అవసరం కాగా, అదే సమయంలో ఆస్ట్రేలియా గెలుపుకు 100 పరుగులు చేయాల్సి వుంది. ఓవర్ నైట్ స్కోరు 44/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత యువ జట్టు 156 పరుగులకు పరిమితమైంది. కేవలం శనివారం నాటి ఆటలో 112 పరుగులు మాత్రమే చేసిన భారత జట్టు మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
భారత ఆటగాళ్లలో జయంత్ యాదవ్(46) రాణించగా, హెర్వాద్కర్(23), ఐయ్యర్(26), నాయర్ (21) ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు వారల్ ఆరు వికెట్లు, సాయర్స్ నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.ఆ తరువాత 159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా' ఎ' జట్టు .. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది.ఒక్క రోజులోనే 12 వికెట్లు నేలరాలడం గమనార్హం.