క్రికెట్‌కు ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు గుడ్ బై
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ వోజెస్, జేవియర్ డోహర్తీలు క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం వెల్లడించింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేసిన ఆడమ్ వోజెస్ తన కెరీర్‌లో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1,485 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. కనీసం 20 ఇన్నింగ్స్‌ల్లో బాట్యింగ్ చేసిన వారిలో 61.87 సగటుతో సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే 31 వన్డేలు ఆడిన వోజెస్ ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో 870 పరుగులు చేశాడు. ఏడు టీ-ట్వంట్వీ మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక అర్ధసెంచరీ సాధించాడు. టెస్టు చరిత్రలో అరంగేట్రంలో సెంచరీ సాధించిన అతి పెద్ద వయస్కుడిగా ఆడమ్ వోజెస్ గుర్తింపు సాధించాడు.
లెఫ్ట్ ఆర్మ్ సిన్నర్ అయిన జేవియర్ డోహర్తీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2010లో అరంగ్రేటం చేశాడు. కెరీర్‌లో 4 టెస్టులు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. 60 వన్డేలు ఆడి 55 వికెట్లు, 11 ట్వంటీ-20లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ వోజెస్ 10 సంవత్సరాలపాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు అన్ని విధాలా కృషి చేశాడని, అతను సాధించిన ఘనతలకు అభినందనలు తెలుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సుదర్‌లాండ్ తెలిపాడు. జేవియర్ డోహర్తీ కూడా మంచి పోటీతత్వం ఉన్న క్రికెటర్ అని, తన శక్తి మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సేవలు అందించాడని సుదర్‌లాండ్ కొనియాడాడు.