దిల్షాన్ చివరి ఆటలో శ్రీలంక పరాజయం
దంబుల్లా: శ్రీలంక స్టార్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ వన్డే కెరీర్‌ను ఓటమితో ముగించేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారమిక్కడ జరిగిన మూడో వన్డేలో లంక రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 49.2 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. చండిమల్ (130 బంతుల్లో 102; 7 ఫోర్లు) శతక్కొట్టాడు. రిటైర్మెంట్ క్రికెటర్ దిల్షాన్ 42 పరుగులు చేశాడు, ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, స్టార్క్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. బెయిలీ (99 బంతుల్లో 70; 5 ఫోర్లు), వేడ్ (46) రాణించారు.
మిగిలిన వారిలో హెడ్ 36, ఫించ్ 30 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్, అపొన్సో, పెరిరా తలా 2 వికెట్లు తీశారు. బుధవారం నాలుగో వన్డే కూడా ఇక్కడే జరగనుంది. 39 ఏళ్ల దిల్షాన్ 330 వన్డేలు ఆడి 10,290 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.