IND VS SA: ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన రోహిత్‌ శర్మ | IND VS SA: Rohit Sharma Surpasses Tillakaratne Dilshan World Record | Sakshi
Sakshi News home page

IND VS SA: ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన రోహిత్‌ శర్మ

Published Sun, Oct 30 2022 6:46 PM | Last Updated on Sun, Oct 30 2022 6:59 PM

IND VS SA: Rohit Sharma Surpasses Tillakaratne Dilshan World Record - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్‌ 30) జరుగుతున్న కీలక సమరంలో టీమిండియా కెప్టెన​ రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ వ్యక్తిగతంగా విఫలమైనా వరల్డ్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో 36వ మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌.. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్‌ పేరిట ఉండేది. తిలకరత్నే టీ20 వరల్డ్‌కప్‌ల్లో మొత్తం 35 మ్యాచ్‌లు ఆడగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ అతని రికార్డును అధిగమించాడు. 2007 నుంచి వరుసగా ఎనిమిది వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్‌.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌​ షకీబ్‌తో కలిసి ఈ అరుదైన ఘనతను సంయుక్తంగా పంచుకున్నాడు.

ఇక పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో రోహిత్‌, దిల్షన్‌ తర్వాతి స్థానాల్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (34), డ్వేన్‌ బ్రావో (34), షాహిద్‌ అఫ్రిది (34), డేవిడ్‌ వార్నర్‌ (32) ఉన్నారు.

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సహా టాపార్డర్‌ మొత్తం విఫలం కావడంతో టీమిండియా 49 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, సూర్యకుమార్‌ మరోసారి ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు.

మెరుపు అర్ధశతకంతో (40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు) టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. సూర్యకుమార్‌ మినహా జట్టు మొత్తం దారుణంగా విఫలమైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్‌ 3, నోర్జే ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని  ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో డికాక్‌ (1), రొస్సో (0) ఔటయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement