14 ఏళ్ల తరువాత 'సెంచరీలు' బాదారు!
సిడ్నీ:ఇప్పటికే పాకిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ను 2-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.. చివరిదైన మూడో టెస్టులో కూడా చెలరేగిపోతుంది. మంగళవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 88.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్లు రెన్ షా(167 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్(113)లు శతకాలు బాదడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
అయితే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్సీజీ)లో ఆసీస్ ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్ లో శతకాలు చేయడం 14 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. చివరిసారి 2002లో జస్టిన్ లాంగర్-మాథ్యూ హేడెన్లు ఈ గ్రౌండ్లో ఒకే ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన ఆసీస్ ఓపెనర్లు. ఆ తరువాత ఇంతకాలానికి సిడ్నీలో వార్నర్-రెన్ షాలు ఆ ఘనతను సాధించారు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెన్ షాకు జతగా, హ్యాండ్ స్కాంబ్(40 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు.
అంతకుముందు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వార్నర్ కెరీర్లో ఇది 18వ టెస్టు సెంచరీ కాగా, పాక్‌పై మూడో సెంచరీ. టెస్టులో తొలిరోజు లంచ్ సమయానికే సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ ఘనత సాధించాడు. గతంలో ట్రంపర్(1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనత వహించారు. దాదాపు నలభై ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా వార్నర్ గుర్తింపు పొందాడు.