బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్!
లండన్: ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్మెన్ ఆడమ్ వోజస్ తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్లోని చాంపియన్షిప్ గేమ్ లో భాగంగా మిడిల్ సెక్స్ కు నేతృత్వం వహిస్తున్న వోజస్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్ కీపర్ జాన్ సింప్సన్ వదిలేయడంతో అది కాస్తా అక్కడే ఉన్న వోజస్ తలకు బలంగా తగిలింది. దీంతో వోజస్ గ్రౌండ్ లో కూలబడిపోయాడు. అతనికి ప్రాథమిక చికిత్స అందించిన గ్రౌండ్ వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని తలకు స్కాన్ చేసిన అనంతరం ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు.
వోజస్ గాయం పట్ల మిడిల్ సెక్స్ డైరెక్టర్ ఆంగూస్ ఫ్రాజర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వోజస్ కు ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం వోజస్ కోలుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్నిరోజుల క్రితం శ్రీలంక ఆటగాడు కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.